Take a fresh look at your lifestyle.

కేదార్‌నాథ్ యాత్రకు ముందు దర్శించే శిరస్సు లేని గణపతి ఆలయం

0 6

అసలు శిరస్సే లేని వినాయకుడిని ఎక్కడైనా చూశారా? ఈ అరుదైన ఆలయం దేవభూమి
ఉత్తరాఖండ్‌లో ఉంది. ఆ ఆలయం ఎక్కడ ఉంది, ఇక్కడి స్థల పురాణం విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా గణపతి ఆలయాల్లో వినాయకుడు లంబోదరుడిగా దర్శనమిస్తాడు. కొన్నిచోట్ల వినాయకుని తొండం కుడివైపుకు ఉంటే, మరికొన్ని చోట్ల వినాయకుని తొండం ఎడమవైపుకు తిరిగి ఉంటుంది. ఎక్కువ ఆలయాల్లో గణపతి పెద్ద పెద్ద చెవులు, చిన్న చిన్న కళ్లు, పెద్ద ఉదరంతో దర్శమివ్వడం చూస్తుంటాం. కానీ అసలు శిరస్సే లేని వినాయకుని ఎక్కడైనా చూశారా! ఈ అరుదైన ఆలయం దేవభూమి ఉత్తరాఖండ్‌లో ఉంది.
మస్తక రహిత వినాయకుడు
స్కంద పురాణం ప్రకారం కైలాసంలో పార్వతీదేవి అభ్యంగన స్నానానికి వెళ్తూ తన ఒంటికి పెట్టుకున్న నలుగుపిండితో ఓ బాలుని తయారు చేసి ఆ బాలునికి ప్రాణప్రతిష్ఠ చేసి గుమ్మం ముందు కాపలా ఉంచి అభ్యంగన స్నానానికి వెళుతుంది. కొంతసేపటికి పరమశివుడు వచ్చి లోనికి వెళ్లబోగా ఆ బాలుడు అడ్డుకుంటాడు. ఇరువురి మధ్య అనేక వాదోపవాదాలు జరుగుతాయి. చివరకు ఆగ్రహించిన పరమ శివుడు తన త్రిశూలంతో ఆ బాలుని శిరసు ఖండించి లోనికి వెళ్తాడు. జరిగింది తెలుసుకుని జగన్మాత దుఃఖిస్తుండగా పరమ శివుడు గజాననుని శిరసు తెచ్చి ఆ బాలునికి అంటించి తిరిగి ప్రాణప్రతిష్ట చేస్తాడు. వినాయక చవితి వ్రతంలో భాగం వచ్చే ఈ కథ మనందరికీ తెలిసిందే! అలా గజాననుని శిరసుతో శోభిల్లే గణపతిని గజాననుడని, గణనాథుడిని కొలుచుకుంటున్నాం. ఈ ఘటనకు నిదర్శనంగా నిలిచిన ఈ పవిత్ర క్షేత్ర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
శిరసు లేని గణపతి క్షేత్రం
కేదార్‌నాథ్ చేరుకునే మార్గంలో వెలసి ఉన్న గౌరీకుండ్ వద్ద శిరసు లేని వినాయకుని ఆలయం వెలసి ఉంది. అలనాటి కైలాస ఘటనకు సాక్ష్యంగా నిలిచే ఈ ఆలయంలో గణనాథుడు శిరసు లేకుండా దర్శనమిస్తాడు. ఈ ఆలయ విశేషాలు చూద్దాం.
కేదార్ లోయలో కొలువైన ముండకటియాదేవభూమిగా పేరొందిన ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లా కేదార్ లోయ ప్రాంతంలో ఈ విశిష్టమైన ఆలయం ఉంది. పవిత్ర కేదార్‌నాథ్ క్షేత్రానికి వెళ్లే మార్గంలో సోన్‌ప్రయాగ్ నుంచి సుమారు 3 కిలోమీటర్ల దూరంలోని మందాకిని నది తీరాన ప్రకృతి ఒడిలో ఈ ముండకటియా గణేశ ఆలయం కొలువై ఉంది. ఈ ఆలయ విశిష్టత గురించి ప్రాచీన శివపురాణంలోనూ ప్రస్తావన ఉండటం విశేషం.
స్థల పురాణం
పరమేశ్వరుడు తన త్రిశూలంతో బాల గణేశుడి శిరస్సును ఖండించిన పవిత్ర ప్రదేశం ఇదేనని ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. అందుకే ఇక్కడ గణపతి శిరసు లేకుండా కేవలం మొండెంతోనే దర్శనమిస్తాడు. సంస్క ృత, హిందీ భాషల్లో ముండ అంటే శిరసు అని, కటియా అంటే నరకడం అని అర్థం. శివుడు గణేశుడి శిరస్సును నరికిన పవిత్ర స్థలం కావడంతో దీనికి ముండకటియా అనే పేరు స్థిరపడింది.కేదార్‌నాథ్ యాత్రికులు తప్పక దర్శించే క్షేత్రం
హిమాలయాల మంచు పర్వతాలు, పక్కనే పరవళ్లు తొక్కే మందాకిని నదీ ప్రవాహం నడుమ కొలువైన ఈ ఆలయం అపారమైన ఆధ్యాత్మిక శక్తిని కలిగి ఉంది. కేదార్‌నాథ్, గౌరీకుండ్ మార్గంలో వెళ్లే ప్రతి ఒక్క భక్తుడు ఈ ముండకటియా ఆలయం వద్ద ఆగి, శిరస్సు లేని విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేసి ఆయన ఆశీస్సులు తీసుకుంటారు.
ముండకటియా ఆలయంలో శిరసు లేని గణపతిని దర్శించి పూజించిన తరువాతనే కేదార్‌నాథ్ యాత్ర ప్రారంభించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఇందువల్ల అత్యంత క్లిష్టమైన కేదార్‌నాథ్ యాత్రలో ఎలాంటి ఆటంకాలు లేకుండా సులభంగా పూర్తవుతుందని విశ్వాసం. అలాగే ఈ గణనాథుని దర్శనం వలన బుద్ధి, యశస్సు, ధైర్యం, శక్తి సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ వింత గణపతి ఆలయాన్ని మనం కూడా దర్శించి గణనాథుని అనుగ్రహాన్ని పొందుదాం.
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః!

Leave A Reply

Your email address will not be published.