నకిరేకల్, మెట్రో న్యూస్.
ఎల్ నినో వంటి సంక్లిష్ట పరిస్థితులలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు .
బుధవారం నల్గొండ జిల్లా, నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలో ఎల్ నినో పై శ్రీనివాస గార్డెన్లో నిర్వహించిన నకిరేకల్ నియోజకవర్గస్థాయి అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఎల్ నినో వల్ల తాగునీరు,వ్యవసాయం,
విద్యుత్తు, పశుసంపద, భూగర్భ జలాలు, ఆహారం,కూలీలకు ఉపాధి వంటి విషయంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని ,అధికారులందరూ వారి శాఖలపై పూర్తి పట్టు కలిగి ఉండి ప్రజలకు మేలు చేసేలా చూడాలన్నారు. డిమాండ్ ఉన్న పంటలు పండించడం ద్వారా రైతులకు ఆదాయం వచ్చే పంటలు వేసుకునేలా చూడాలని, విద్యుత్తు,నీటిని పొదుపుగా వాడుకునేలా అవగాహన కల్పించాలని కోరారు.మరసు తుఫాను నేపథ్యంలో ప్రస్తుతం కళ్ళాలలో ఉన్న ధాన్యం తడిచిపోకుండా వెంటనే కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. వచ్చే సీజన్లలో రైతులు సన్నధాన్యాన్ని పండించే లా చైతన్యం చేయాలని, అలాగే రైస్ మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేసి సన్న ధాన్యం సరఫరా చేసే విధంగా ప్రోత్సహించాలని, రైస్ మిల్లర్ల సమస్యను తాను కూడా రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. విబిజి రామ్ జి కింద గ్రామాలలో రహదారులు, మట్టి రోడ్ల పనులు, రహదారులకు ఇరువైపులా కంపచెట్లను తొలగించే కార్యక్రమాలను చేపట్టాలని, తాగునీటి విషయంలో గ్రామాలలో అధికారులు, ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకునేలా చర్యలు తీసుకోవాలని, ఆయిల్ పామ్ పై అవగాహన కల్పించాలని, పసుగ్రాస కొరత లేకుండా కార్యచరణ ప్రణాళిక రూపొందించాలని, ప్రస్తుతం ఉన్న పశుగ్రాసాన్ని జాగ్రత్తగా వాడడంతో పాటు, భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా చూడాలని, గ్రామపంచాయతీ కార్యదర్శులు గ్రామాలలోనే ఉండి నీటి వృధాను అరికట్టడమే కాకుండా, నీరు పొదుపుగా వాడుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు.
భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎల్ నినోపై రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజా ప్రతినిధులందరితో సమీక్షించడం జరిగిందని, ఎల్ నినో వల్ల బోర్లు ఎండిపోయే పరిస్థితులు వచ్చాయని, డిసెంబర్, జనవరి నుండి సమస్య ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉందని, రైతులు యాసంగిలో వరి వేసుకోవద్దని, వివిజి రాంజీ కింద రైతులు, రైతుకూలీలకు ఉపయోగపడే పనులు చేపట్టాలని, భూగర్భ జలాలను కాపాడుకోవాలని, ఎల్ నినోను ప్రజలు సీరియస్ గా తీసుకోవాలని కోరారు.