ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత అయిన సూర్య భగవానునికి దేశవ్యాప్తంగా అనేక చోట్ల ఆలయాలున్నాయి. ప్రధానంగా ఒక్క కాశీ పట్టణంలోనే ద్వాదశ ఆదిత్యుల ఆలయాలు వెలసి ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని అరసవిల్లిలో, ఒడిషాలోని కోణార్క్‌లో సూర్య దేవాలయాలు ప్రపంచ ప్రసిద్ధి చెందినవి. ఇదే ఒడిశాలో రెండో కోణార్కగా విరాజిల్లుతున్న మరో సూర్య దేవాలయం గురించిన విశేషాలు తెలుసుకుందాం.
దారు సూర్య దేవాలయం
ప్రత్యక్ష భగవానుడైన సూర్య భగవానుని లేలేత కిరణాలు ప్రసరించే ఆలయాల్లో అరసవిల్లి, కోణార్క ప్రసిద్ధి చెందినవి. ఇదే కోవలోకి చెందినదే మరో ఆలయం ఒడిశాలోనే వెలసి ఉంది. ఁదారు సూర్య దేవాలయంఁ అంటే చెక్కతో తయారైన సూర్య దేవాలయంగా ప్రసిద్ధి చెందిన ఆ ఆలయ విశేషాలు ఇప్పుడు చూద్దాం.
దారు సూర్య దేవాలయం ఎక్కడుంది?
ఒడిశాలో ప్రసిద్ధ సూర్య దేవాలయం
ఉన్న కోణార్క్ నుంచి సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న గంజాంలోని గుడుంబా పట్టణంలో దారు సూర్య దేవాలయం వెలసి ఉంది. కోణార్క్ దేవాలయ నిర్మాణ శైలికి కాస్త భిన్నంగా దర్శనమిచ్చే ఈ ఆలయ పైకప్పు పూర్తిగా చెక్కతో నిర్మించడం విశేషం.
ఆలయ చారిత్రక నేపథ్యం
పూర్వం రుషులచే నిర్మించిన ఈ ఆలయాన్ని క్రీ.శ. 1790 ప్రాంతంలో ఘుమ్సర్ రాజ్యానికి చెందిన రాజు శ్రీకర భంజదేవ పునర్నిర్మించారని ఆలయ చరిత్ర ద్వారా తెలుస్తోంది.
దారు కోణార్క్ అని ఎందుకు అంటారు?
ప్రాచీన కోణార్క్ ఆలయం పూర్తిగా రాతితో నిర్మితమైతే, బుగూడలోని ఈ ఆలయం దాని విశిష్టమైన చెక్క శిల్పకళకు ప్రపంచ ప్రసిద్ధి చెందింది. కాబట్టి ఈ ఆలయాన్ని దారు కోణార్క్ అంటారు.
ఆకట్టుకునే నిర్మాణ శైలి!
ఈ ఆలయం మొత్తాన్ని 46 స్తంభాలతో నిర్మించడం విశేషం. పూర్తిగా చెక్కతో తయారైన ఆలయ పైకప్పుపై చెక్కిన అత్యంత సూక్ష్మమైన, అందమైన చిత్రకళా శిల్పాలు, నగిషీలు భక్తులను మంత్రముగ్ధులను చేస్తాయి.
సూర్యాస్తమయ కిరణాలు ప్రసరించే ఏకైక దేవాలయం:సాధారణంగా సూర్య దేవాలయాలు ఉదయించే సూర్యుడిని ఆహ్వానిస్తూ తూర్పు ముఖంగా వెలసి ఉండడం చూస్తుంటాం కానీ దారు కోణార్క్ సూర్య దేవాలయం మాత్రం పడమర ముఖంగా ఉంటుంది. అందువల్ల, సాయంత్రం వేళ అస్తమించే సూర్యుని తొలి కిరణాలు నేరుగా గర్భగుడిలోని స్వామి వారి పాదాలపై పడతాయి.త్రిమÖర్తుల స్వరూపం బిరంచి నారాయణ స్వామి
ఈ క్షేత్రంలో గర్భాలయంలో కొలువైన సూర్యభగవానుడు బిరంచి నారాయణ స్వామిగా పూజలందుకోవడం విశేషం. ఈ విగ్రహం మాల్తీగడ కోట శిథిలాల నుంచి లభ్యమైనట్లుగా ఆలయ చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఈ విగ్రహం త్రిమÖర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అంశలతో వెలసిన సూర్యుని స్వరూపం కావడం విశేషం.
రథం ఆకృతిలో నిర్మాణం
దారు కోణార్క్ ఆలయం కూడా కోణార్క్ సూర్య దేవాలయం మాదిరిగానే సూర్యభగవానుని రథం ఆకారంలో నిర్మించి ఉండడం విశేషం. ఈ రథానికి ఏడు గుర్రాలు, ఎడమ వైపున ఒక చక్రం ఉండగా, సూర్యుని రథసారథి అయిన అరుణుడు రథాన్ని నడుపుతున్నట్లుగా చెక్కి ఉంది.
ఆకట్టుకునే కుడ్యచిత్రాలు
ఆలయ గోడలపై రామాయణం, మహాభారతం, కృష్ణ లీలలు, విష్ణుమÖర్తి దశావతారాలకు సంబంధించిన అద్భుతమైన సాంప్రదాయ ఒడిశా శైలి వర్ణచిత్రాలు చిత్రించి ఉన్నాయి.
ప్రధాన పండుగలు
దారు కోణార్క్ సూర్య దేవాలయంలో ప్రతిరోజూ నిత్యపూజలు ఒడిశా సాంప్రదాయ రీతిలో జరుగుతాయి. ప్రతి ఆదివారం ప్రత్యేక అభిషేకాలు, పూజలు జరుగుతాయి. మకర సంక్రాంతితో పాటు ప్రతి మాసంలో వచ్చే రాశి ఆధారిత సంక్రాతి రోజుల్లో కూడా ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఇక మాఘ మాసంలో వచ్చే రథసప్తమి, పుష్య మాసంలో వచ్చే సాంబ దశమి పండుగలను ఇక్కడ అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.
దర్శన ఫలం
దారు కోణార్క్ సూర్య దేవాలయంలో వెలసిన శ్రీ బిరంచి నారాయణ స్వామిని దర్శించి పూజించడం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగుతాయని, ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని విశ్వాసం.
ఎలా చేరుకోవాలి?
దారు కోణార్క్ సూర్య దేవాలయం గంజాం జిల్లాలోని ప్రముఖ నగరమైన బెర్హంపూర్ నుంచి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. బెర్హంపుర్ రైల్వే స్టేషన్ నుంచి ప్రభుత్వ బస్సులు లేదా ప్రైవేటు వాహనాల ద్వారా బుగూడలోని ఈ శ్రీ బిరంచి నారాయణ దేవాలయానికి సులభంగా చేరుకోవచ్చు. మనం కూడా శ్రీ బిరంచి నారాయణ స్వామి ఆలయాన్ని సందర్శించి ఆయురారోగ్య ఐశ్వర్యాలు పొందుదాం.
ఓం నమో సూర్య దేవాయ నమః!