హైకమాండ్ ఆలోచన ఏంటి
(మెట్రో న్యూస్ బ్యూరో)
తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్‌గా ఉన్నాయి. మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన చర్యలు తీసుకుంటుందనే చర్చే సాగుతోంది. క్రమశిక్షణ కమిటీ నివేదికను పీసీసీ ఇప్పటికే హస్తిన పెద్దలకు చేరవేసింది. కొండా సురేఖపై వేటు వేయాలనేదే ఆ నివేదిక సారాంశం! మంత్రి పదవి నుంచి తప్పించడమే కాదు… పార్టీ నుంచి కూడా సస్పండ్ చేయాలని సీఎం వర్గం అధిష్టానంపై ఒత్తిడి పెంచుతోంది. మరి ఏఐసీసీ అగ్రనేతల ఆలోచన ఏంటి? ఓ బీసీ మహిళా మంత్రిపై చర్యలకు ఉపక్రమిస్తారా.. లేక మందలించి వదిలేస్తారా! ఇప్పటికే బీసీ సంఘాలు కొన్ని నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. సురేఖపై యాక్షన్ తీసుకుంటే… పార్టీకి లాభమా.. నష్టమా అన్న కోణంలోనూ రాహుల్ గాంధీ ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది. ప్రతిపక్ష పార్టీ గ్రాఫ్ పెరుగుతున్న క్రమంలో సురేఖ విషయంలో తొందరపాటుతో నిర్ణయం తీసుకోరాదని భావిస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి.

రేవంత్ సర్కారు కొలువుదీరిన తర్వాత ఎస్సీ, ఎస్టీ వర్గీకరణతోపాటు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు ప్రాధాన్యమిచ్చింది. అసెంబ్లీలోనూ ఏకగ్రీవ తీర్మానం చేయడం తెల్సిందే. అటు హైకమాండ్ కూడా తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్ల విషయంలో సానుకూలంగానే ఉంది. కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో మోదీ ప్రభుత్వాన్నే దోషిగా నిలబెట్టింది. ఈ పరిస్థితుల్లో తెలంగాణలో… అదీ రాజకీయంగా కీలకమైన ఉమ్మడి వరంగల్ జిల్లాలో.. పలు నియోజకవర్గాలను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్న కొండా కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ దూరం చేసుకుంటుందా అనే చర్చా మొదలైంది. అసలే ఓవైపు బీఆర్ఎస్… సమస్యలపై నిలదీస్తూ ప్రభుత్వానికి, మంత్రులకు కంటిమీద కునుకు లేకుండ చేస్తున్నది. బీజేపీ కూడా విద్యార్థుల ఫీజు బకాయిల ఎజెండాతో పోరుబాట పట్టింది. అందుకే హైకమాండ్ సురేఖ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోందని సమాచారం!
ప్రతిపక్షాలు జెన్‌జీని ఆకర్షించేందుకు ఉద్యమ కార్యాచరణ చేపడుతుంటే… తెలంగాణ కాంగ్రెస్ మాత్రం అంతర్గత పోరాటాల సుడిగుండం దిశగా పయనిస్తోంది. అసమ్మతి నేతలు, ప్రజాప్రతినిధుల బుజ్జగింపు ప్రక్రియ లేదు. అలకబూనిన, ధిక్కార స్వరం వినిపిస్తున్న నేతల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఈ విషయంలో విఫలమయ్యారు. కొండా ఫ్యామిలీ విషయంలోనూ ఇదే జరిగింది. పార్టీ పెద్దలతో ఆ కుటుంబానికి కమ్యూనికేషన్ గ్యాప్ కొనసాగుతోంది. సొంత బలంతోనే రాజకీయాల్లో నెట్టుకొస్తున్న సురేఖ పరిస్థితికి తగ్గట్టుగా వ్యవహరించడం లేదనే అభిప్రాయం వినిపిస్తుంది. సుస్మిత వ్యాఖ్యలను ఖండిస్తే… పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు! ఏదేమైనా రాజకీయాల్లో హత్యలు ఉండవంటారు. అన్నీ ఆత్మహత్యలే!