Take a fresh look at your lifestyle.

ఎల్ నినో పరిస్థితుల నేపధ్యంలో నీటి పొదుపును పాటించాలి

0 3

( మెట్రోన్యూస్ )

ఎల్ నినో కారణంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు నీటి పొదుపును పాటించాలని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ సూచించారు. ప్రజలకు ఉపయుక్తంగా నిలిచే మాధవనగర్, అర్సపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయించాలని, రానున్న నాలుగైదు నెలల్లో వీటిని అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో శనివారం ఎంపీ అర్వింద్ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ, మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్, కలెక్టర్ ఇలా త్రిపాఠి, నగర మేయర్ కే.ఉమారాణి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో వివిధ శాఖల ద్వారా చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ప్రగతిపై సమావేశంలో చర్చించారు. అంతకుముందు గత సమావేశంలో చేసిన తీర్మానాలపై చేపట్టిన చర్యల గురించి అధికారులు ఎం.పీ దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ, అందుబాటులో ఉన్న నీటి వనరులను ఎంతో జాగ్రత్తగా వాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయమై ప్రజల్లో, రైతులలో విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. కాగా, మాధవనగర్, అర్సపల్లి ఆర్.ఓ.బీల నిర్మాణాలలో ఎనలేని తాత్సారం జరుగుతోందని ఎం.పీ సంబంధిత అధికారులపై ఒకింత అసహనం వ్యక్తం చేశారు. మైల్ స్టోన్ ప్రకారం నిర్విరామంగా పనులు జరిపిస్తూ నాలుగైదు నెలలలో పూర్తి చేయించాలని, మరోమారు గడువు పొడిగింపుకు ఉండకూడదని ఆర్ అండ్ బీ, రైల్వే అధికారులకు సూచించారు. నిజామాబాద్ నగరంలో భూగర్భ డ్రైనేజీ పనులను కూడా వచ్చే ఫిబ్రవరి నాటికి పూర్తి చేయాలని గడువు విధించారు. అమృత్ 2.0 పథకం కింద చేపడుతున్న తాగునీటి సరఫరా మెరుగుదల పనులను, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకుల నిర్మాణాలను సకాలంలో పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు. కేంద్రం నుండి కేటాయించబడిన నిధులను సక్రమంగా వినియోగిస్తూ, నిర్దేశిత గడువులోగా ప్రజోపయోగ పనులు పూర్తయ్యేలా అధికారులు చొరవ చూపాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల నిధులను విద్యార్థులకు అందించారా అని ఎం.పీ సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే విద్యార్థుల బ్యాంకు ఖాతాలలో నేరుగా ఉపకార వేతనాలను జమ చేయించామని సంక్షేమ శాఖల అధికారులు ఎం.పీ దృష్టికి తెచ్చారు. కాగా, డిసెంబర్ నెలలో నిర్వహించనున్న ఖేలో ఇండియా జాతీయ స్థాయి టేబుల్ టెన్నిస్ క్రీడా పోటీలకు జిల్లా యంత్రాంగం చొరవతో ప్రభుత్వం నిజామాబాద్ జిల్లాను వేదికగా ఎంపిక చేయడం పట్ల ఎం.పీ అర్వింద్ హర్షం వెలిబుచ్చారు. క్రీడా పోటీల విజయవంతానికి, జిల్లాలో క్రీడా సదుపాయాల అభివృద్ధి కోసం కేంద్రం నుండి పూర్తి స్థాయిలో సహకారం అందేలా కృషి చేస్తానని అన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, జిల్లాలో ఎల్ నినో ప్రభావం గురించి వివరిస్తూ, అధికార యంత్రాంగం తరపున చేపడుతున్న ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికను వెల్లడించారు. అదృష్టవశాత్తు ఖరీఫ్ సీజన్ లో వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో జిల్లా రైతాంగం గట్టెక్కగలిగారని అన్నారు. అయితే ప్రస్తుతం యాసంగిలో మాత్రం పంటలకు సాగునీరు అందించే పరిస్థితి లేదని, ఈ మేరకు ప్రభుత్వం కూడా స్పష్టమైన నిర్ణయం తీసుకుందని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.