Take a fresh look at your lifestyle.

రైతులకు ఇబ్బంది కాకుండా విద్యుత్తు సబ్ స్టేషన్ లో ఏర్పాటు.

0 2

మెట్రో న్యూస్.

మంత్రి శ్రీధర్ బాబు.

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శుక్రవారం రేగొండ మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కోటంచ శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు వేదమంత్రోచ్ఛారణల మధ్య మంత్రికి వేదాశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలు, శేషవస్త్రాన్ని బహూకరించి స్వామివారి చిత్రపటాన్ని అందజేసి ఆశీర్వదించారు. అంతకుముందు ఆలయ పరిసరాల్లో నూతనంగా నిర్మిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్‌ను మంత్రి పరిశీలించారు. కాంప్లెక్స్ నిర్మాణం, నిర్వహణ, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

రైతులకు ఇబ్బందులు లేకుండా విద్యుత్ సబ్‌స్టేషన్ల ఏర్పాటు

ఒడితలలో రూ.2 కోట్లతో నిర్మించిన 33/11 కేవీ ఉపకేంద్రం ప్రారంభం
చిట్యాల, ఆంధ్రప్రభ : ప్రజాపాలన ప్రభుత్వంలో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని, రైతులకు విద్యుత్‌ సరఫరాలో ఇబ్బందులు కలగకుండా సబ్‌స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం ఒడితల గ్రామంలో రూ.2 కోట్లతో నిర్మించిన 33/11 కేవీ విద్యుత్‌ ఉపకేంద్రాన్ని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ. రైతులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అనేక ప్రతిపాదనలు చేశారని తెలిపారు. నియోజకవర్గంలో గతంలో 49 సబ్‌స్టేషన్లు ఉండగా, ప్రస్తుతం మరో 12 సబ్‌స్టేషన్లను ఏర్పాటు చేసుకున్నామని, 127 ట్రాన్స్‌ఫార్మర్లను కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎల్‌నినో ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉందని, విద్యుత్‌ డిమాండ్‌ పెరగడంతో పాటు భూగర్భ జలమట్టం తగ్గిందని పేర్కొన్నారు. ఇతర ప్రాంతాల నుంచి విద్యుత్‌ తీసుకొస్తున్నామని తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడటంతో పాటు ఉపాధి పరంగా సమస్యలు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. రైతులు నీటిని పొదుపుగా వినియోగించుకుంటూ పంటలు సాగు చేయాలని, రబీ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. తాగునీరు, విద్యుత్‌ సమస్యలు లేకుండా చూస్తామని, ఇందుకు అందరూ సహకరించాలని కోరారు. ఈ ప్రాంత ప్రజలకు గోదావరి జలాలను అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బండి భగవాన్, కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.