(మెట్రో న్యూస్)
నాగర్‌కర్నూల్ మెడికల్ కళాశాల ఆవరణలో నిర్మాణంలో ఉన్న 550 పడకల ఆసుపత్రి పనులను డిసెంబర్ నెలాఖరులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ పాటిల్ అధికారులను ఆదేశించారు.మంగళవారం ఆసుపత్రి నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన,ఇప్పటివరకు పూర్తయిన పనులు, పెండింగ్‌లో ఉన్న పనుల పురోగతిని సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిర్మాణ పనుల్లో ఎలాంటి జాప్యం జరగకుండా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు మిగిలి ఉన్న పనులను గుర్తించి, ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. నిర్ణీత గడువులోగా నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.ఆసుపత్రి నిర్మాణంలో ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని,ఉపయోగించే నిర్మాణ సామగ్రి నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించాలని అధికారులకు సూచించారు గడువులోగా పనులు పూర్తి చేయడంతోపాటు,భవిష్యత్తులో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా ఆసుపత్రి నిర్మాణం నాణ్యతతో ఉండాలని పేర్కొన్నారు.పనుల పురోగతిని నిరంతరం సమీక్షిస్తూ నిర్మాణంలో ఎదురయ్యే సమస్యలను సకాలంలో పరిష్కరించుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.పెండింగ్ పనులపై ప్రత్యేక దృష్టి సారించి,నిర్ణీత లక్ష్యాలను చేరుకునేలా అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.ఈ పర్యటనలో మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.డి. సులేమాన్,ఇంజనీరింగ్ అధికారి సుధాకర్ రెడ్డి,ఇతర వైద్య కళాశాల అధికారులు పాల్గొన్నారు.