(సూపర్ లీడ్)
ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టులోనే కేసీఆర్ లక్ష కోట్లు దోచుకున్నారనే అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి బాగా హైలైట్ చేశారు. జనాల్లోకి ఇది బాగా వెళ్లింది. ఘోష్ కమిషన్ వేయడం.. కేసీఆర్ సహా కీలక నాయకులను, ఎందరో అధికారులను విచారించడం జరిగి చాలా కాలమైంది. కానీ నిజనిజాలు తేలట్లేదు. అవినీతి ఆరోపణల విషయంలో చివరకు సీబీఐ విచారణ కూడా ప్రభుత్వం కోరింది. ఒక్క మేడిగడ్డ బ్యారేజీపైనే విచారణ కోరడం కాదు… మొత్తం ప్రాజెక్టు నిర్మాణంపై విచారణ కోరాలని బీజేపీ వాదిస్తోంది. మొత్తానికి కాళేశ్వరం అంశంలో ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ కాలక్షేప
రాజకీయాలు చేస్తున్నాయన్న అభిప్రాయం నిజం కాకుండా చూసుకోవాలి. సిట్‌లు, సెట్‌లు వేస్తూ పోవడం కాదు… ఆరోపణలు చేసినంత స్పీడుగా.. విచారణలోనూ వేగం పెంచాలి. అపుడే రేవంత్ రెడ్డి పట్ల విశ్వసనీయత పెరుగుతుంది.
రాజకీయాలంటేనే రాజకీయం చేయడం. రాజకీయాలు చేయని పార్టీలు అనుకున్న లక్ష్యాలను చేరుకోలేవు. నాయకులకూ ఇది వర్తిస్తుంది. ఎలాగోలా ఎదగడమే రాజకీయ నాయకుల పంథా. మన పార్టీ కోసం, మన మనుగడ కోసం అవతలి పార్టీని, అవతలి నాయకులను విమర్శించక తప్పని పరిస్థితి. అవతలి పార్టీలో ఉన్నోళ్లు… మన మిత్రులైనా… వాళ్లతో సత్సంబంధాలున్నా… చివరకు మన బంధువులైనా సరే… వదిలిపెట్టే ప్రస్తక్తే కనిపించదు. అసలు ఆ ఆలోచనే రాకూడదు. వాటినే ఫక్తు రాజకీయాలంటుంటారు. ఇక్కడే కాదు, ప్రపంచవ్యాప్తంగా రాజకీయ ముఖచిత్రం ఈ తీరుగానే ఉంటుంది. తెలంగాణలో రాజకీయ చైతన్యం మరీ ఎక్కువ. రెండు జాతీయ పార్టీలు, ఒక ప్రాంతీయ పార్టీ మధ్య రాజకీయాలు భలే రంజుగా సాగుతున్నాయి.

మన రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షమైన భారత రాష్ట్ర సమితి మధ్య మాటల యుద్ధమే జరుగుతోంది. ఇంకా చెప్పాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, బీఆర్ఎస్ అగ్రనేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు జోరందుకున్నాయి. కొద్దికాలంగా అవే మీడియాలో బ్యానర్ వార్తలుగా మారుతున్నాయి. పదేళ్లు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని ఏలిన కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావునే చిత్తుచేసి ఎనుమల రేవంత్ రెడ్డి సీఎం గద్దెనెక్కారు. పీసీసీ అధ్యక్షుడి హోదాలో… గత ప్రభుత్వంపైనా, కల్వకుంట్ల కుటుంబం పైనా నిప్పులు చెరిగి… ప్రజల్లో ధీరుడు అనిపించుకున్న రేవంత్ రెడ్డి… ఇప్పటికీ అవే ఆరోపణలు, దూషణలు చేస్తూ ఉండటం నిజంగానే ఆశ్చర్యం కలిగిస్తుంది.
కాలగమనంలో వారు వీరయ్యారు. వీరు వారయ్యారు. బీఆర్ఎస్ స్థానంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఊహించినట్టుగానే రేవంత్ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు. సీఎం పీఠాన్ని అధిరోహించి… చూస్తూ చూస్తూ మూడేళ్లు కావస్తోంది. విచిత్రంగా ఆయన అవే ఆరోపణలు, అవే దూషణలతో కాలం గడిపేస్తున్నారనే అభిప్రాయం నెలకొంటోంది. కూలిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టు, కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, అనుమానాస్పద ఫార్ములా ఈ-కారు రేసులు, విద్యుత్ కొనుగోళ్లు, 22ఏ నిషేధిత భూముల వ్యవహారం, కల్వకుంట్ల కుటుంబ సభ్యుల భూదోపిడీ, ఆస్తులు, కమిషన్లు… ఇలా చాలా వాటిపై ముఖ్యమంత్రి అసెంబ్లీలోనూ ప్రస్తావిస్తూ… విచారణకు ఆదేశించారు.
రాష్ట్ర ప్రజలకూ ఈ వ్యవహారాలపై అవగాహన ఉంది. సీఎం లేవనెత్తిన అంశాలు, ఆయన చేసిన ఆరోపణల నిగ్గు తేల్చాలన్నదే చాలా మంది కోరుకుంటున్నారు. రేవంత్ రెడ్డి మాటల మనిషిగా మిగిలిపోవద్దని… చేతల మనిషిగా చూడాలంటున్నారు. ఆరోపణలు చేయడం, కేసులు పెట్టడం, నిందితులుగా తేల్చడం సరే… దోషిగా కూడా ప్రజల ముందు నిలబెట్టాలి. అప్పుడే ఈ ఆరోపణలకు విలువ ఉంటుంది. లేదంటే… రాజకీయాల్లో ఈ తరహా ఆరోపణలు నిత్యం చూస్తూనే ఉంటాం. కావాలనే కేసీఆర్ అండ్ ఫ్యామిలీపై కక్ష సాధింపు చర్యలుగానే మిగిలిపోతాయనే విషయం ముఖ్యమంత్రికి తెలియంది కాదు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా దేశంలోని ఇతర పార్టీలు, కీలక నాయకుల మీదికి దర్యాప్తు సంస్థలు ఉసిగొల్పుతున్నట్టే… రేవంత్ సర్కార్ కూడా అదే తరహాలో పనిచేస్తుందన్న భావన ప్రజలకు కలగక మానదు! కేసు తర్వాత కేసు… ఒక్కొక్కటిగా పాలకు పాలు… నీళ్లకు నీళ్లుగా తేల్చాల్సిన బాధ్యత స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే. ఆరోపణలే చేస్తాం… ఊరికే కేసులు పెడతాం అంటే… ఎక్కువ కాలం సాగదు. అధికారం అనుభవించిన వారైనా, అధికారం అనుభవిస్తున్న వారైనా, అధికారం కోసం ఎదురుచూస్తున్న వారైనా… అందరికి ఇదే సూత్రం వర్తిస్తుంది. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.
దేవరకొండ కాళిదాస్ `ఎడిటర్