కొడంగల్ (మెట్రో న్యూస్):
కేంద్ర ప్రభుత్వం సర్ పేరుతో ఓట్లను తొలగించే కుట్ర చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలను టార్గెట్ చేశారని… మహారాష్ట్ర, బీహార్, బెంగాల్ ఎన్నికల్లో అలాగే గెలిచారని అన్నారు. తెలంగాణలోనూ అలాగే గెలవాలని బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. శనివారం కొడంగల్ పట్టణంలోని తన నివాసంలో పార్టీ కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. తెలంగాణలో దొంగదెబ్బ తీస్తామంటే ఇక్కడ చూస్తూ ఊరుకునేవారు లేరన్నారు. ఓట్లు తొలగించి దొంగ దెబ్బ తీయాలనుకుంటే కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకోరు. ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని కాంగ్రెస్ అనుకూల ఓట్లను తొలగించాలని చూస్తున్నారు.. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓట్లను బీజేపీ టార్గెట్ చేసిందన్నారు.
ఇంతకుముందు ఎన్నికల్లో ఓడించేందుకు ఈడీ, సీబీఐ ఉపయోగించేవారు… కానీ ఇప్పుడు ఓట్ల తొలగింపుతో తడిగుడ్డతో గొంతు కోసే చర్యలకు దిగుతున్నారు. చిన్న తప్పిదాలను సాకుగా చూపి బీజేపీ పేదల ఓట్లను తొలగించే కుట్ర చేస్తోంది. కాంగ్రెస్‌ను ఓడించేందుకు ఈ కుట్రకు బీఆరెస్ కూడా బీజేపీకి మద్దతు ఇస్తోంది. ఓటు హక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరిపై ఉంది. ప్రజల ఓట్లు కాపాడాల్సిన బాధ్యత ముఖ్య నాయకులపై ఉంది. గ్రామాల వారీగా బీఎల్ఏ లను సమన్వయం చేసుకుని పేదల ఓట్లు తొలగించకుండా చూడాలి. ఓట్లు తొలగించకుండా చూసుకోవాల్సిన బాధ్యత సంబంధిత మండల నాయకులదే! ప్రతీ ఒక్కరు 4 గ్రామాలకు ఒక నాయకుడు బాధ్యత తీసుకోవాలి. ప్రతీ బూత్ లో ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా జాగ్రత వహించాలి. అందరూ అప్రమత్తంగా ఉండాలి.. బీజేపీ, బీఆరెస్ కుట్రలను తిప్పి కొట్టాలని పార్టీ శ్రేణులను సీఎం మార్గదర్శకం చేశారు.



