హైదరాబాద్ (మెట్రో న్యూస్):
ప్రజల పట్ల బాధ్యతగా ఉంటూనే… నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర పోలీసులకు దిశానిర్దేశం చేశారు. బాధతోని, సమస్యతోని వచ్చే సామాన్యులకు, బాధితులతోనే ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తూనే… అక్రమార్కులకు పాల్పడేవారు, భూకబ్జాదారులకు, డ్రగ్స్‌లో ఉండే వాళ్లకు, ఆహారం కల్తీ చేసేవారికి, నియమ నిబంధనలు ఉల్లంఘించేవారి పట్ల మాత్రం కఠినంగా వ్యవహరించవలసిందేనని సీఎం స్పష్టం చేశారు. అప్పుడే నేరాలు తగ్గుతాయని పేర్కొన్నారు. పోలీసులందరూ ఈ రోజే ప్రతిజ్ఞ చేయాలని అన్నారు. బుధవారం గోషామహల్ స్టేడియంలో జరిగిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన ముఖ్యమంత్రి… పోలీస్ పరేడ్‌లో పాల్గొని గౌరవ వందనం స్వీకరించారు.

ముఖ్యమంత్రి మాట్లాడుతూ, సమాజం కోసం ప్రాణాలను త్యాగం చేసిన పోలీస్ అమరులకు నివాళులు. దేశవ్యాప్తంగా దేవ్ సింగ్, ప్రమోద్ కుమార్, గాజుల సౌమ్య విధి నిర్వహణలో మరణించారు. శాంతిభద్రతల పరిరక్షణలో వారి త్యాగాలను మరువలేం. అమరుల కుటుంబం ఒంటరి కాదు.. వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. రాష్ట్ర అభివృద్ధి శాంతి భద్రతల పరిరక్షణ ఎంతో ముఖ్యం. పోలీస్ శాఖలో మరో 5 వేల ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకున్నాం. 2028లోగా పోలీస్ శాఖలో అన్ని ఖాళీలను భర్తీ చేస్తాం. గతంలో ఎన్నడూ లేని విధంగా 112 డీఎస్పీలను నియమించాం. ట్రాన్స్ జెండర్స్ ను ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమించి వారి ఆత్మగౌరవాన్ని పెంచాం. గతంలో విధి నిర్వహణలో వీరమరణం పొందిన వారికి ఎక్స్‌గేషియా పెంచాం. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయే హోంగార్డుల కుటుంబాలకు ఇకనుంచి రూ.10 లక్షలకు పెంచాలని డీజీపీని ఆదేశిస్తున్నట్టు చెప్పారు.
డ్రగ్స్, గంజాయి వ్యాప్తి అత్యంత ప్రమాదకరం. యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా చూడాలి. డ్రగ్స్ నియంత్రణలో ఈగల్ ఫోర్స్ పనితీరును, డీజీపీని అభినందిస్తున్నా… కల్తీ ఆహారంపై ఉక్కు పాదంతో అణచివేసేందుకు టీజీ సేఫ్‌ను తీసుకొచ్చాం. షీ టీమ్స్ సేవలను కొనసాగిస్తూ మహిళల భద్రతను మరింత బలోపేతం చేస్తున్నాం. మహిళలు, పిల్లలకు అత్యవసర పరిస్థితుల్లో తక్షణ రక్షణ అందించడానికి ఏప్రిల్‌లో స్పందన – తక్షణ రక్షణ బృందాలను ప్రారంభించాం. మహిళలు, చిన్నారులకు సంబంధించిన కేసుల్లో పోలీసులు మరింత సున్నితంగా వ్యవహరించాలి. బాధితులకు న్యాయం అందించడంలో జాప్యం జరగకూడదు. మహిళల భద్రత కేవలం పోలీసు శాఖ బాధ్యత కాదు. సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించాలి. అమరుల త్యాగాలను గౌరవిద్దాం. వారి ఆశయాలను కొనసాగిద్దాం. శాంతియుతమైన, సురక్షితమైన, అభివృద్ధి చెందిన తెలంగాణను నిర్మించుకుందాం అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.