హైదరాబాద్ (మెట్రో న్యూస్):
యూత్ డిక్లరేషన్ పేరుతో తెలంగాణ యువతకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలైన రెండు లక్షల ఉద్యోగాలు, నెలకు రూ. 4,000 నిరుద్యోగ భృతి, రాజీవ్ యువ వికాసం కార్డు పథకం అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిలదీస్తూ, తెలంగాణ బీజేవైఎం ఆధ్వర్యంలో శనివారం నిరసన కార్యక్రమం జరిగింది. నిరుద్యోగ సమస్యలపై అసెంబ్లీ అమరవీరుల స్థూపం వద్ద బిజెపి యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గణేశ్ కుండె, తదితరులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. రేవంత్ సర్కారు అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా… ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని యువమోర్చా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఎన్నికల సమయంలో యువతకు ఇచ్చిన హామలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.