Take a fresh look at your lifestyle.

రాష్ట్రానికి ఎనిమిది కీలక ప్రతిపాదనలు…

0 18

హైదరాబాద్‌ (మెట్రో న్యూస్‌):

  • కొత్తగూడెం ఎర్త్‌ సైన్సెస్‌ వర్సిటీకి రూ.100 కోట్ల సీఎస్‌ఆర్‌ నిధులు కోరిన మంత్రి తుమ్మల
  • కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సానుకూల స్పందన, కోల్‌ ఇండియా ఎండీకి ఫోన్‌

రాష్ట్ర అభివృద్ధి, రైతుల సంక్షేమం, విద్యుత్‌ అవసరాలు, పారిశ్రామిక ప్రగతికి తోడ్పడేలా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రం ముందు ఎనిమిది కీలక ప్రతిపాదనలు ఉంచారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డిని శుక్రవారం కలిసి తెలంగాణకు సంబంధించిన పలు సమస్యలను పరిష్కరించాలని కోరారు. భద్రాద్రి కొత్తగూడెంలోని డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ ఎర్త్‌ సైన్సెస్‌ విశ్వవిద్యాలయానికి కోల్‌ ఇండియా సీఎస్‌ఆర్‌ నిధుల నుంచి రూ.100 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేయగా.. కిషన్‌రెడ్డి సానుకూలంగా స్పందించి కోల్‌ ఇండియా ఎండీకి ఫోన్‌ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. యాదాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రానికి మహానది బొగ్గు క్షేత్రాల నుంచి బొగ్గు కేటాయించాలని, సత్తుపల్లి బ్లాక్‌-III గనిని సింగరేణికి అప్పగించాలని తుమ్మల కోరారు. రామగుండం ఎరువుల కర్మాగారంలో సాంకేతిక సమస్యలను పరిష్కరించి యూరియా ఉత్పత్తి, సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఎర్త్‌ సైన్సెస్‌ విశ్వవిద్యాలయంలో ఆధునిక పరిశోధనలకు అవసరమైన ప్రయోగశాలలు, మౌలిక వసతుల కల్పనకు నిధులు మంజూరు చేయాలని కోరారు. అలాగే కొత్తగూడెం గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయానికి అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని, సత్తుపల్లి–కొవ్వూరు, పెనుబల్లి–కొండపల్లి రైల్వే లైన్లకు అనుమతులు మంజూరు చేసి పనులు ప్రారంభించాలని ప్రతిపాదించారు. పాండురంగాపురం–మల్కన్‌గిరి రైల్వే లైన్‌ పనులను వేగవంతం చేసి, వచ్చే ఏడాది భద్రాచలంలో జరిగే గోదావరి పుష్కరాల నాటికి సారపాక వరకు రైలు సదుపాయం కల్పించాలని మంత్రి కోరారు. ఈ ప్రాజెక్టులతో గిరిజన ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతోపాటు వ్యవసాయ, పారిశ్రామిక సరుకుల రవాణా సులభమవుతుందని వివరించారు. తుమ్మల ప్రతిపాదనలపై కిషన్‌రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ.. సంబంధిత శాఖలతో చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యంగా ఎర్త్‌ సైన్సెస్‌ విశ్వవిద్యాలయానికి సీఎస్‌ఆర్‌ నిధుల అంశంపై వెంటనే కోల్‌ ఇండియా ఎండీతో మాట్లాడారు.

Leave A Reply

Your email address will not be published.