Take a fresh look at your lifestyle.

యూపీహెచ్‌సీల బలోపేతానికి కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి చొరవ.. ఉచితంగా వైద్య పరికరాల పంపిణీ

0 12

హైదరాబాద్‌( మెట్రో న్యూస్) :

సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (యూపీహెచ్‌సీ) వైద్య సేవలను మెరుగుపరిచేందుకు కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి గురువారం పలు ఆరోగ్య కేంద్రాలను సందర్శించారు. కవాడిగూడలోని డీబీఆర్‌ మిల్స్‌ యూపీహెచ్‌సీతోపాటు ముషీరాబాద్‌ ప్రధాన రహదారి, మెట్టుగూడలోని ఆరోగ్య కేంద్రాలను పరిశీలించారు. రోగులకు అందుతున్న సేవలు, ఉచిత మందుల లభ్యత, మౌలిక వసతులపై వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆయా కేంద్రాలకు అవసరమైన ఆధునిక వైద్య పరికరాలను కిషన్‌రెడ్డి అందజేశారు. వీటిలో ఈసీజీ మెషీన్‌తో కూడిన రెక్లైనర్‌ బెడ్‌, రక్త నమూనాల సేకరణకు ఫ్లెబోటమీ కుర్చీలు, ఎల్‌ఈడీ డిస్‌ప్లే బోర్డులు, గోప్యత కోసం తెరలు, పిల్లలు, పెద్దలకు ఉపయోగపడే నెబ్యులైజర్లు ఉన్నాయి. వీటితోపాటు రక్తపోటు పరీక్షించే డిజిటల్‌ బీపీ పరికరాలు, గ్లూకోమీటర్లు, సూదుల తొలగింపునకు నీడిల్‌ హబ్‌ కట్టర్లు, డిజిటల్‌ బరువు కొలిచే యంత్రాలు, స్టీల్‌ కుర్చీలు, మంచినీటి డిస్పెన్సర్లను సమకూర్చారు. పేదలకు నాణ్యమైన వైద్య సేవలను ఉచితంగా అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఆరోగ్య కేంద్రాల్లో మౌలిక వసతులను మెరుగుపరుస్తున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. కొత్త పరికరాల అందుబాటుతో రోగులకు ప్రాథమిక స్థాయిలోనే అవసరమైన పరీక్షలు, చికిత్స అందించేందుకు వీలవుతుందని తెలిపారు. ఆరోగ్య కేంద్రాలకు వచ్చే ప్రజలకు వైద్య సేవల్లో ఇబ్బందులు కలగకుండా, సిబ్బంది మరింత సమర్థంగా సేవలందించేందుకు ఈ పరికరాలు ఉపయోగపడనున్నాయి.

Leave A Reply

Your email address will not be published.