(మెట్రోన్యూస్ )
అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలను వెచ్చిస్తూ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ను ఏర్పాటు చేస్తోందని కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడించారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి సంబంధించి జిల్లా కేంద్రంలోని కోటగల్లి బాలికల పాఠశాల ప్రాంగణంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు కోసం అనువైన పరిస్థితులను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, మేయర్ ఉమారాణిలతో కలిసి కలెక్టర్ ఇలా త్రిపాఠితో గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పబ్లిక్ స్కూల్ కోసం అందుబాటులో ఉన్న స్థలం, ఇతర వసతులను పరిశీలించి, సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఒకేచోట కొనసాగుతున్న ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, జూనియర్ కళాశాలలను కలుపుకుని తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం రూ. 6 కోట్ల నిధులు సైతం మంజూరు చేసిందని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. అన్ని వసతులు, అధునాతన సౌకర్యాలతో మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో ఒకటవ తరగతి నుండి 12 తరగతి వరకు నాణ్యమైన విద్యా బోధన జరిగేలా తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని అన్నారు. బోధన్ నియోజకవర్గంలోని నవీపేటలో కూడా పబ్లిక్ స్కూల్ ను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. కాగా, అధునాతన వసతులతో ప్రభుత్వం నిర్మించదల్చిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణానికి సమగ్ర చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సంబంధిత అధికారులను ఆదేశించారు. అదనపు తరగతి గదులతో పాటు, ల్యాబ్ రూమ్ లు, లైబ్రరీ, కంప్యూటర్ గదులు, ఆర్.ఓ ప్లాంట్, బోర్ వెల్, క్రీడా మైదానం తదితర నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ వి.భుజంగరావు, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఇంచార్జి జిల్లా విద్యా శాఖ అధికారి సాయగౌడ్ , నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, కార్పొరేటర్ ప్రసన్న తదితరులు ఉన్నారు.