నగరంలోని మౌలిక వసతుల అభివృద్ధికి కరీంనగర్ నగరపాలక సంస్థ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. ఇందులో భాగంగా 13, 42, 49వ డివిజన్లలో యూఐడీఎఫ్, ఎంజీఎఫ్ నిధులతో చేపట్టనున్న మొత్తం రూ.1.85 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా 13వ డివిజన్ శివనగర్‌లో బైపాస్ రోడ్డులో లారెల్ స్కూల్ సమీపంలో యూఐడీఎఫ్ నిధులతో రూ.75 లక్షల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
అనంతరం 42వ డివిజన్ భాగ్యనగర్‌లో మమత థియేటర్ సమీపంలో యూఐడీఎఫ్ నిధులతో రూ.50 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే 49వ డివిజన్ భాగ్యనగర్‌లో బాలాజీ సూపర్ మార్కెట్ సమీపంలో యూఐడీఎఫ్ నిధులతో రూ.50 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రెయిన్, పైప్‌లైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా పోచమ్మ కమాన్ సమీపంలో ఎంజీఎఫ్ నిధులతో రూ.10 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రెయిన్, పైప్‌లైన్ నిర్మాణ పనులకు కూడా శంకుస్థాపన చేశారు.
నగరంలోని ప్రతి డివిజన్లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. రహదారులు, డ్రెయినేజీ, తాగునీటి పైప్లైన్ల వంటి ప్రాథమిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సహకారంతో నగర అభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకువచ్చి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వై. సునీల్ రావు మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, కార్పొరేటర్లు ఎన్నం లక్ష్మీ ప్రకాష్, బోయినపల్లి ప్రవీణ్ రావ్, గాజా రమ శివరాం,తెల్ల లక్ష్మీ రమేష్, పొన్నం లక్ష్మీ మొండయ్య, వాసాల రమేష్, వేముల కవిత చంద్రశేఖర్, బండారి వేణు, వంగల పవన్, నాంపల్లి రేణుక శ్రీనివాస్, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, స్థానికులు పాల్గొన్నారు.