Take a fresh look at your lifestyle.

నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు షాక్.. దేశం విడిచి వెళ్లాలంటూ పోలీసుల నోటీసులు!

0 14
  • నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు ముంబై పోలీసుల నోటీసులు
  • అక్టోబర్ 28లోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశం
  • భారత పౌరుడు కాకపోయినా నిరసనలో పాల్గొన్నందుకు చర్యలు
  • ఎన్నికల కమిషనర్‌కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో పాల్గొన్న ఇమ్రాన్
  • ఆయన అమెరికా పౌరుడని, ఓసీఐ కార్డు హోల్డర్ అని సమాచారం

బాలీవుడ్ ప్రముఖ నటుడు ఆమిర్ ఖాన్ మేనల్లుడు, నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు ముంబై పోలీసులు ఊహించని షాక్ ఇచ్చారు. అక్టోబర్ 28లోగా భారతదేశం విడిచి వెళ్లాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేశారు. భారత పౌరుడు కానప్పటికీ రాజకీయ నిరసనలో పాల్గొన్నందుకే ఆయనపై ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.

వివరాల్లోకి వెళితే.. ఈ నెల‌ 10న ముంబైలోని ఆగస్ట్ క్రాంతి మైదానంలో ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ), ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌ కుమార్‌కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించింది. ఈ ఆందోళనలో ఇమ్రాన్ ఖాన్ తన భాగస్వామి, నటి లేఖా వాషింగ్టన్, కజిన్ జేన్ మేరీ ఖాన్‌తో కలిసి పాల్గొన్నారు. ఆ సమయంలో పోలీసులు ఇమ్రాన్‌తో సహా సుమారు 400 మందిని అదుపులోకి తీసుకుని, ఆ తర్వాత విడుదల చేశారు.

అయితే, ఇమ్రాన్ ఖాన్ భారత పౌరుడు కాదని, ఆయన అమెరికా పౌరసత్వంతో ‘ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా’ (ఓసీఐ) కార్డును కలిగి ఉన్నారని పోలీసులు గుర్తించారు. “భారత పౌరుడు కానప్పటికీ నిరసనలో పాల్గొన్నందున ఇమ్మిగ్రేషన్ చట్టంలోని సంబంధిత నిబంధనల ప్రకారం ఇమ్రాన్ ఖాన్‌పై చర్యలు తీసుకున్నాం” అని ముంబై పోలీసులు తమ నోటీసులో పేర్కొన్నారు.

అరెస్ట్ సమయంలో ఇమ్రాన్ ఖాన్ పోలీస్ వ్యాన్ నుంచి “నేను డ్రైవ్‌కు వెళ్తున్నట్లున్నాను” అని క్యాప్షన్ పెట్టి ఫొటో పోస్ట్ చేశారు. అలాగే, పోలీసులతో ‘జై హింద్’ అని చెబుతున్న వీడియో కూడా వైరల్ అయింది. తనను ఎందుకు అదుపులోకి తీసుకున్నారో తెలియదని, సుమారు రెండు గంటల పాటు వ్యాన్‌లో తిప్పి వదిలేశారని ఆయన చెప్పిన మాటలు కూడా అప్పట్లో చర్చనీయాంశమయ్యాయి.

ఈ నిరసనలో తుషార్ గాంధీ నేతృత్వంలోని ‘హమ్ భారత్ కే లోగ్’, సీపీఐ(ఎం) కార్యకర్తలు కూడా పాల్గొని అదుపులోకి గురయ్యారు. తాజా పోలీసు నోటీసులతో ఇమ్రాన్ ఖాన్ వ్యవహారం బాలీవుడ్‌లో కలకలం రేపుతోంది.

Leave A Reply

Your email address will not be published.