Take a fresh look at your lifestyle.

ప్రజాస్వామ్య వ్యవస్థల అధ్యయనం ద్వారా పార్లమెంటరీ విధానాలపై మరింత అవగాహన పెంపొందించుకోవచ్చు

0 22

మెట్రో న్యూస్

ప్రజాస్వామ్య వ్యవస్థల అధ్యయనం ద్వారా పార్లమెంటరీ విధానాలపై మరింత అవగాహన పెంపొందించుకోవచ్చని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.స్విట్జర్లాండ్ దేశంలోని బెర్న్ నగరంలో ఉన్న చారిత్రాత్మక పార్లమెంట్ భవనాన్ని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , తెలంగాణ శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ , శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ గురువారం సందర్శించారు.
కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన విదేశీ అధ్యయన పర్యటనలో భాగంగా తెలంగాణ శాసన వ్యవస్థ ప్రతినిధుల బృందం స్విట్జర్లాండ్ పార్లమెంట్ భవనాన్ని సందర్శించింది.
ఈ సందర్భంగా స్విట్జర్లాండ్ పార్లమెంటరీ వ్యవస్థ, ప్రజాస్వామ్య సంప్రదాయాలు, శాసనసభల పనితీరు, చట్టాల రూపకల్పన విధానాలు, ప్రజాప్రతినిధుల బాధ్యతలు తదితర అంశాలపై అధ్యయనం చేయడం ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని తెలిపారు.
ఈ సందర్భంగా తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో శాసనసభలు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తాయని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా చట్టాలను రూపొందించడం, ప్రభుత్వ విధానాలపై చర్చించడం, ప్రజా సమస్యలకు పరిష్కార మార్గాలను అన్వేషించడం ప్రజాప్రతినిధుల ప్రధాన బాధ్యతగా ఆయన తెలిపారు. ప్రపంచంలోని వివిధ దేశాల పార్లమెంటరీ వ్యవస్థలను అధ్యయనం చేయడం ద్వారా ప్రజాస్వామ్య విలువలు, శాసనసభల నిర్వహణ, పారదర్శకత, జవాబుదారీతనం వంటి అంశాలపై మరింత అవగాహన పెంపొందించుకునే అవకాశం ఉంటుందని వివరించారు. స్విట్జర్లాండ్ దేశం ప్రత్యక్ష ప్రజాస్వామ్య విధానాలకు ప్రత్యేక గుర్తింపు పొందింది. ప్రజల భాగస్వామ్యానికి ప్రాధాన్యతనిచ్చే అక్కడి ప్రజాస్వామ్య విధానాలు అధ్యయనం చేయదగినవి అని , ఇలాంటి అంతర్జాతీయ అధ్యయన పర్యటనల ద్వారా లభించే అనుభవాలు తెలంగాణ రాష్ట్ర శాసన వ్యవస్థను మరింత సమర్థవంతంగా, ప్రజలకు చేరువగా తీర్చిదిద్దేందుకు ఉపయోగపడతాయి” అని పేర్కొన్నారు.
ఈ పర్యటనలో తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ , శాసన మండలి సెక్రెటరీ డా. నరసింహాచార్యులు , శాసన సభ స్పీకర్ ఓఎస్డీ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.