Take a fresh look at your lifestyle.

ఆసియాక‌ప్ లో మరోసారి ట్రోఫీ రగడ మొదలయ్యే చాన్స్.. ఫైనల్‌కు మొహ్సిన్ నఖ్వీ హాజరుతో నయా టెన్ష‌న్

0 6

భారత పురుషుల క్రికెట్ జట్టు ఆసియా కప్ ట్రోఫీ కోసం ఇప్పటికీ ఎదురుచూస్తున్నట్లే, ఇప్పుడు భారత మహిళల జట్టుకు కూడా అలాంటి పరిస్థితే ఎదురయ్యేలా అవ‌కాశం ఉంది. ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) చైర్మన్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చీఫ్ మొహ్సిన్ నఖ్వీ సెప్టెంబర్ 13న జరిగే మహిళల ఆసియా కప్ ఫైనల్ పోరుకు హాజరుకానున్నట్లు సమాచారం. ముగింపు వేడుకలకు అతడిని చీఫ్ గెస్ట్ గా పిలిచారు. గతంలో జరిగినట్లే విజేతలకు ట్రోఫీని నఖ్వీ స్వయంగా అందించాలని భావిస్తున్నాడు. అయితే ఒకవేళ భారత్ టైటిల్ గెలిస్తే నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించేందుకు భారత జట్టు నిరాకరించే అవకాశాలు ఉండటంతో మరోసారి తీవ్ర వివాదం చెలరేగే పరిస్థితులు కనిపిస్తున్నాయని నిపుణులు అంటున్నారు.

2025 ఎడిష‌న్ లో ఉద్రిక్త‌త‌..
2025 మెన్స్ ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించి భారత్ ఛాంపియన్‌గా నిలిచిన తర్వాత పోడియం వద్ద పెద్ద రగడ జరిగిన సంగ‌తి తెలిసిందే. ట్రోఫీని అందజేయడానికి మొహ్సిన్ నఖ్వీ దాదాపు అరగంట పాటు వేదికపై వేచి చూశాడు. అయితే సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు అతడి చేతుల నుంచి ట్రోఫీని తీసుకోవడానికి ససేమిరా ఒప్పుకోక‌పోవ‌డంతో జ‌గ‌డం స్టార్ట్ అయింది. వేరే ఇతర ఏసీసీ అధికారి చేతుల మీదుగా ట్రోఫీని ఇవ్వాలని టీమ్ ఇండియా పట్టుబట్టింది. దీంతో తీవ్ర అసహనానికి గురైన నఖ్వీ ప్రెజెంటేషన్ వేడుకను మధ్యలోనే వదిలేసి ట్రోఫీని తన వెంట హోటల్ గదికి తీసుకెళ్లిపోయాడు. ఇప్పటికీ ఆ ట్రోఫీ దుబాయ్ లోని ఏసీసీ కార్యాలయంలోనే ఉండిపోయింది తప్ప భారత జట్టుకు అధికారికంగా అందలేదని తెలుస్తోంది.

సేమ్ సీన్ రిపీట్..
హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత మహిళల జట్టు అద్భుత ఫామ్‌తో సెమీఫైనల్ చేరుకుని టైటిల్ ఫేవరెట్‌గా నిలిచింది. ఇటీవల పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, పాక్ కెప్టెన్ సనా మిర్ టాస్ సమయంలో షేక్ హ్యాండ్ కూడా ఇచ్చుకోలేదు. గతేడాది సూర్యకుమార్ యాదవ్, సల్మాన్ అలీ ఆఘా మధ్య జరిగిన ఘటనను ఇది అంద‌రి మైండ్ లోకి వ‌చ్చింది. ఇరు దేశాల క్రికెట్ బోర్డుల మధ్య సంబంధాలు అత్యంత ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో మహిళల జట్టు కూడా అదే బాటలో నడిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

మేలుకున్న బీసీసీఐ.. సంప్ర‌దింపులు
పురుషుల ట్రోఫీ వివాదంపై ఇప్పటికే బీసీసీఐ, ఏసీసీ అధికారులతో అనేక దఫాలుగా చర్చలు జరిపిన సంగ‌తి తెలిసిందే. అయినప్పటికీ ఆ ప్రతిష్టంభన ఇంకా తొలగిపోలేదు. ఇప్పుడు మహిళల టోర్నీలోనూ భారత్ విజేతగా నిలిస్తే నఖ్వీ నుంచి ట్రోఫీ తీసుకునేందుకు హర్మన్ సేన నిరాకరించవచ్చని ప్రచారం ముమ్మ‌రంగా సాగుతోంది. దీంతో ఈ ప్రతిష్టాత్మక ఫైనల్ ముగింపు వేడుక ఎలా ముగుస్తుందోనన్న అంశం క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది.

Leave A Reply

Your email address will not be published.