హైదరాబాద్ (మెట్రో న్యూస్):
- పిల్లల భద్రతకు ఆన్‌లైన్ సేఫ్టీ ఫ్రేమ్‌వర్క్
- పిల్లలను గమనిస్తూ ఉండాలని తల్లదండ్రులకు సూచన
- నల్సా సౌత్‌జోన్ రీజనల్ కాన్ఫరెన్స్‌లో సీఎం రేవంత్ రెడ్డి
సమాజంలో ప్రతి ఒక్కరికీ న్యాయం అందాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. కేవలం డబ్బు లేకపోవడం వల్ల న్యాయం ఎవ్వరికీ దూరం కాకూడదని అభిప్రాయపడ్డారు. శనివారం హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణా హోటల్లో జరిగిన నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా) సౌత్ జోన్ రీజినల్ కాన్ఫరెన్స్‌లో సీఎం పాల్గొన్నారు. కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మెగ్వాల్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వి.మోహన, జస్టిస్ అలోక్ అరాదే, జస్టిస్ ఆర్.మహదేవన్, జస్టిస్ విక్రమ్ నాథ్, తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ, ఈ సదస్సుకు పిల్లల సైబర్ భద్రత అనే చాలా ముఖ్యమైన అంశాన్ని ఎంచుకున్నందుకు జస్టిస్ విక్రమ్ నాథ్, నల్సాకు ధన్యవాదాలు ముఖ్యమంత్రి తెలిపారు. ఈ రోజుల్లో పిల్లలు ఎక్కువ సమయం ఆన్‌లైన్‌లో గడుపుతున్నారు. తమ పిల్లలు ఇంటర్నెట్‌లో ఏం చేస్తున్నారు అనేది చాలా మంది తల్లిదండ్రులకు తెలియడం లేదన్నారు. తెలంగాణ హైకోర్టు, టీజీఎస్-ఎల్‌ఎస్‌ఏతో కలిసి చర్చించి పిల్లల ఆన్‌లైన్ భద్రత కోసం సమగ్ర చైల్డ్ ఆన్‌లైన్ సేఫ్టీ ఫ్రేమ్‌వర్క్‌ను సిద్ధం చేయాలన్నారు.
తెలంగాణలో మహిళలు, పిల్లల రక్షణ తయ ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని సీఎం వెల్లడించారు. పోలీసులు, భరోసా కేంద్రాలు, చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్లు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు, ప్రత్యేక కోర్టులు, న్యాయ సేవా సంస్థలు… మన దగ్గర అనేక వ్యవస్థలు ఉన్నాయి. మన భరోసా కేంద్రాల్లో మహిళలు, పిల్లలకు ఒకే చోట పోలీసు సహాయం, వైద్య సేవలు, న్యాయ సహాయం, కౌన్సెలింగ్ అందిస్తున్నాం. దేశంలోనే తొలి చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టు హైదరాబాద్‌లో ఏర్పాటు చేశాం. విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఆన్‌లైన్ భద్రతపై అవగాహన కల్పిస్తున్నాం. విద్యార్థులనే సైబర్ అంబాసిడర్లుగా తయారు చేసి, తమ తోటి విద్యార్థులకు సైబర్ భద్రతపై అవగాహన కల్పిస్తున్నాం. తల్లిదండ్రులకు నా విజ్ఞప్తి ఒక్కటే… మీ పిల్లలతో మాట్లాడండి. వారు ఇంటర్నెట్‌లో ఏం చేస్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? ఏం చూస్తున్నారు? తెలుసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.