మెట్రో న్యూస్
అర్హులైన ఏ ఒక్క ఓటరూ తమ ఓటు హక్కును కోల్పోకుండా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు టి.కె. శ్రీదేవి అధికారులను ఆదేశించారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రాతో కలిసి ఆమె సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా పరిశీలకులు మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో కీలకమని పేర్కొన్నారు. మెరుగైన సమాజ నిర్మాణానికి ఓటు హక్కు పునాది వంటిదన్నారు. ఓటు హక్కు దుర్వినియోగాన్ని అరికట్టడం ఎంత ముఖ్యమో.. అర్హులైన ఒక్క ఓటరూ ఓటు హక్కును కోల్పోకుండా చూడటం అంతే ముఖ్యమని స్పష్టం చేశారు.
జిల్లాలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహిస్తున్న కలెక్టర్, అధికారులు, సహకరిస్తున్న రాజకీయ పార్టీల ప్రతినిధులను అభినందించారు. మిగిలి ఉన్న ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. బీఎల్ఓలు తప్పనిసరిగా ఓటర్ల ఇళ్లకు స్వయంగా వెళ్లి ధ్రువపత్రాల పరిశీలన చేపట్టాలని ఆదేశించారు.
ఓటర్ల జాబితా నుంచి తొలగించిన ఓట్లకు సంబంధించిన కారణాలను రికార్డుల్లో స్పష్టంగా నమోదు చేయాలని సూచించారు. భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా రికార్డులు పక్కాగా నిర్వహించాలన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి అందే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని తెలిపారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకోసం ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఓటు హక్కు ప్రాముఖ్యతపై స్వీప్ కార్యక్రమాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. అధికారులంతా మరింత బాధ్యతతో పనిచేసి జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించారు.
జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియ పకడ్బందీగా కొనసాగుతోందని కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. మిగిలి ఉన్న డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామని చెప్పారు. జిల్లాలో ఇప్పటివరకు చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన వివరాలను పరిశీలకులకు సమగ్రంగా వివరించారు. బీఎల్ఓలు ఓటర్ల ఇళ్లకు వెళ్లి ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ చేపడుతున్నారని తెలిపారు. ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. మిగిలి ఉన్న ఫారాల పరిష్కారం, ఫిర్యాదుల పరిష్కారాన్ని ఎప్పటికప్పుడు పూర్తి చేస్తున్నామని వివరించారు. నోటీసుల జారీ ప్రక్రియ పూర్తయిందన్నారు. మరణించిన వ్యక్తుల పేర్లు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదైన ఓట్లు, శాశ్వతంగా వలస వెళ్లిన వారి ఓట్లను గుర్తించి జాబితా నుంచి తొలగించినట్లు కలెక్టర్ తెలిపారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేసేలా చర్యలు చేపట్టామని చెప్పారు. ఎస్ఐఆర్ ప్రక్రియకు జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీల నుంచి పూర్తి సహకారం లభిస్తోందని తెలిపారు.
సమీక్ష అనంతరం రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు టి.కె. శ్రీదేవి, కలెక్టర్ భవేశ్ మిశ్రాతో కలిసి నిర్మల్ పట్టణంలోని కస్బా, నిర్మల్ గ్రామీణ మండలంలోని న్యూ పోచంపాడ్ గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. అక్కడ కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియపై స్థానిక బీఎల్ఓలను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఓటర్ల నుంచి సేకరించిన ధ్రువపత్రాల పరిశీలన, ఫారాల పరిష్కారం తదితర అంశాలను పరిశీలించారు. ప్రక్రియ కొనసాగుతున్న తీరుపై పరిశీలకులు సంతృప్తి వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో ఇన్ఛార్జి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రాథోడ్ రమేష్, భైంసా, ఉట్నూర్ సబ్ కలెక్టర్లు అజ్మీరా సంకేత్ కుమార్, ప్రణయ్ కుమార్, ఆర్డీవో దేవీదాస్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది తదతరులు పాల్గొన్నారు.