2న ముహూర్తం…
నిర్ణయం తీసేసుకున్న హైకమాండ్!
(మెట్రో న్యూస్ బ్యూరో)
తెలంగాణ మంత్రి వర్గం నుంచి కొండా సురేఖ నిష్క్రమణ ఖాయమైంది. సెప్టెంబరు 2వ తేదీన ఆమెను సాగనంపడానికి ముహూర్తం ఖరారైంది. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఈ మేరకు నిర్ణయం తీసేసుకుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. క్రమశిక్షణ కమిటీ సిఫారసుల నేపథ్యంలో… సురేఖపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు… బర్తరఫ్ చేస్తారా… రాజీనామా చేయిస్తారా… లేక మందలించి వదిలేస్తారా ..! గత వారం పది రోజులుగా జరుగుతున్న తెలంగాణ రాజకీయాలలో ఇదే చర్చ. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఈ అంశంపైనే ఊహాగానాలు. సీనియర్ మంత్రుల నుంచి పార్టీ సీనియర్ల వరకు కొండా ఫ్యామిలీనే తప్పుబట్టడంతో… హైకమాండ్‌కు నిర్ణయం తీసుకోవడం సులభతరమైంది.
ఈ వ్యవహారాన్ని సాగదీయకుండా ఆమెకు ఉద్వాసన పలికితేనే… లైను దాటుతున్న ఇతర నేతలకు గట్టి సంకేతాలు వెళ్తాయని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా నమ్ముతున్నట్టు వినికిడి!
కొండా సురేఖ, మాజీ మంత్రి చిన్నారెడ్డిలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం తథ్యమని… ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇంఛార్జ్ కేసీ వేణుగోపాల్ ఈ విషయంలో పార్టీ నిర్ణయాన్ని వెల్లడిస్తారని ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉన్న నాయకులు భావిస్తున్నారు. విదేశాల్లో ఉన్న కేసీ సోమవారం రాత్రికే స్వదేశం తిరిగివస్తున్నారని… తెలంగాణ నేతలకు అపాయింట్‌మెంట్ ఇచ్చారని తెలుస్తోంది. మంగళవారం ఢిల్లీలో సెంట్రల్ వాటర్ కమిషన్ ఎదుట తెలంగాణ-మహారాష్ట్రకు సంబంధించి తుమ్మిడిహట్టి ఎత్తు అంశంపై కీలక సమావేశం ఉండటంతో… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ భేటీకి హాజరుకానున్నారు. మరోవైపు బుధవారం వైఎస్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొనేందుకు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్తున్నారు.
ఈ నేపథ్యంలో తెలంగాణకు చెందిన పార్టీ కీలక నేతలు కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లకార్జున్ ఖర్గేలను కలవనున్నారు.కొండా సురేఖ, చిన్నారెడ్డి క్రమశిక్షణా రాహిత్యాన్ని, పార్టీకి జరుగుతున్న నష్టం గురించి పార్టీ పెద్దలకు సీఎం రేవంత్ స్వయంగా వినిపించనున్నారు. ఇపుడు చర్యలు తీసుకోకపోతే… అసమ్మతిని నియంత్రించడం ఎవరి వల్లా కాదని నివేదించనున్నారు. దీనిపై అంతర్గతంగా నివేదికలు తెప్పించుకున్న హైకమాండ్… మంత్రి సురేఖ విషయంలో రాష్ట్ర నాయకత్వం అభిప్రాయంతో ఏకీభవిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. మంగళ, బుధవారాల్లో పలు దఫాలుగా జరిగే భేటీలలో… మంత్రి వర్గ విస్తరణ, ప్రక్షాళనపైనా ఏఐసీసీ గ్రీన్‌సిగ్నల్ ఇస్తుందన్నది మరో ఆసక్తికర పరిణామం!