Take a fresh look at your lifestyle.

టార్గెట్ కేసీఆర్‌… క‌ల్వ‌కుంట్ల కుటుంబం!

0 22

హైద‌రాబాద్ (మెట్రో న్యూస్‌):

  • 16 వివాదాస్ప‌ద భూముల గుట్టు తేల్చండి
  • ఉన్న‌త‌స్థాయి విచార‌ణ క‌మిటీని
    ఏర్పాటు చేసిన రేవంత్ స‌ర్కార్
  • క‌మిటీ చైర్‌ప‌ర్స‌న్‌గా టెక్నిక‌ల్
    ఎడ్యుకేష‌న్ క‌మిష‌న‌ర్‌ శ్రీ‌దేవ‌సేన‌
  • క‌న్వీన‌ర్‌గా రిజ‌స్ట్రేష‌న్ శాఖ
    స్పెష‌ల్ సెక్రెట‌రీ రాజీవ్ గాంధీ
  • స‌భ్యులుగా జ‌న‌గాం క‌లెక్ట‌ర్
    సందీప్ కుమార్ ఝా,
    సంబంధిత‌ జిల్లాల క‌లెక్ట‌ర్లు
  • వీలైనంత త్వ‌ర‌గా నివేదిక
    ఇవ్వాల‌ని ప్ర‌భుత్వ ఆదేశం

మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ల‌క్ష్యంగా క‌ల్వ‌కుంట్ల కుటుంబం భూ ఆక్ర‌మ‌ణ‌ల‌ గుట్టు తేల్చేందుకు ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. మొత్తం 16 వివాదాస్ప‌ద భూముల వ్య‌వ‌హారంపై స‌మ‌గ్ర విచార‌ణ జ‌రిపేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం ఉన్న‌త‌స్థాయి క‌మిటీని ఏర్పాటు చేస్తూ గురువారం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ భూములు మాజీ మంత్రులు, బీఆర్ఎస్ పార్టీ నేత‌లు, కేసీఆర్ స‌న్నిహితులకు చెందిన‌వి కావ‌డం గ‌మ‌నార్హం. విచార‌ణ క‌మిటీ చైర్‌ప‌ర్స‌న్‌గా టెక్నిక‌ల్ ఎడ్యుకేష‌న్ క‌మిష‌న‌ర్‌, ఐఎఎస్ అధికారి శ్రీ‌దేవ‌సేన వ్య‌వ‌హ‌రిస్తారు. క‌న్వీన‌ర్‌గా రిజ‌స్ట్రేష‌న్ శాఖ స్పెష‌ల్ సెక్రెట‌రీ రాజీవ్ గాంధీ నియ‌మితుల‌య్యారు. సభ్యులుగా జ‌న‌గాం క‌లెక్ట‌ర్ సందీప్ కుమార్ ఝా, సంబంధిత జిల్లాల క‌లెక్ట‌ర్లు ఉంటారు. ఈ క‌మిటీ త్వ‌ర‌లో నిర్దేశించిన జిల్లాలలో ప‌ర్య‌టిస్తుంది. ఉత్వ‌ర్వుల‌లో పేర్కొన్న వ్య‌క్తుల‌, సంస్థ‌ల‌కు చెందిన భూముల‌కు సంబంధించి శాస‌నాలు, నిబంధ‌న‌లు, చట్టాలు, జీఓలు… తదిత‌ర అంశాల‌ను క్షుణ్నంగా ప‌రిశీలించి… ఒక‌ గ్రౌండ్ రిపోర్ట్‌ను ప్ర‌భుత్వానికి అంద‌జేస్తుంది.

ఈ క‌మిటీ త్వ‌ర‌లో ఆయా జిల్లాలలో ప‌ర్య‌టించి… ప్ర‌భుత్వ భూములు, సీలింగ్ భూములు, అసైన్ భూములు, జాగీర్ భూములు, భూదాన్ భూములు, ఇనామ్ భూములు, అట‌వీ భూములు, భూసేక‌ర‌ణ పున‌రావాస‌ భూములు, వాట‌ర్ బాడీస్‌, కాచ్‌మెంట్ ఏరియా… అలాగే రెవిన్యూ రికార్డుల‌ను అధికారికంగా ప‌రిశీలిస్తుంది. ఆయా విభాగాల అధికారుల స‌హ‌కారాన్ని తీసుకొని స‌మాచారం సేక‌రిస్తుంది. క‌ల్వ‌కుంట్ల కుటుంబానికి సంబంధించిన‌, ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న కేసీఆర్ స‌న్నిహితులు, బీఆర్ఎస్ నాయ‌కుల భూములే ల‌క్ష్యంగా శ్రీ‌దేవ‌సేన క‌మిటీ క్షేత్ర‌స్థాయిలో విచార‌ణ చేయ‌నుంది. విచార‌ణ జ‌ర‌పాల్సిన వ్య‌క్తులు, సంస్థ‌లు, గ్రామ‌, మండ‌ల‌, జిల్లా వివ‌రాల‌ను ఉత్వ‌ర్వుల‌లో స్ప‌ష్టంగా వివ‌రించారు.

ఈ క‌మిటీ విచారణ చేప‌ట్టే భూముల వివరాల్లోకి వెళితే… మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, ఆయ‌న కుటుంబ స‌భ్యులకు సంబంధించి సిద్దిపేట జిల్లా మ‌ర్కూక్ మండ‌లంలోని ఎర్ర‌వ‌ల్లి, మ‌ర్కూక్‌, శివార్ వెంక‌టాపూర్ గ్రామాలున్నాయి. సిద్దిపేట జిల్లా రామంచ గ్రామంలోని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు, ఆయ‌న కుటుంబ స‌భ్యులు, ఎం.హ‌న్మంత‌రావు, దివంగ‌త ఎమ్మెల్యే రామ‌లింగారెడ్డి, జ‌న్వాడ‌లోని కేటీఆర్ ఫామ్‌హౌస్‌, మాజీ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి, ఆయ‌న కుటుంబ స‌భ్యులు, సన్నిహితులు, రంగారెడ్డి జిల్లా అజీజ్‌న‌గ‌ర్‌లో హ‌రీశ్‌రావు, అజీజ్‌న‌గ‌ర్‌లోనే మాజీ ఎమ్మెల్యే పైల‌ట్ రోహిత్ రెడ్డి, రంగారెడ్డిలోని బ‌హ‌దూర్‌గూడ‌లో మాజీ మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్, వ‌ట్టినాగుల‌ప‌ల్లిలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి, వ‌ట్టినాగుల‌ప‌ల్లిలోనే మాజీ మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్‌, తిమ్మాపూర్‌లో భూదాన్ భూముల కొనుగోళ్లు, సికింద్రాబాద్ జీరా భూముల‌ను రెగ్యుల‌రైజ్ చేసుకున్న మాజీ ఎమ్మెల్సీ స్టీఫెన్‌స‌న్‌ల‌కు సంబంధించిన భూములను పరిశీలిస్తారు.

అలాగే మ‌హబూబ్‌న‌గ‌ర్ జిల్లాలో బాలాన‌గ‌ర్ మండ‌లం గుండేడ్ గ్రామంలో ఎం.హ‌న్మంత‌రావు, ఎం. సుమన్‌, టి.మ‌హేష్ రావు త‌దిత‌రులు వివిధ సంస్థ‌ల పేరుతో ధ‌ర‌ణి పోర్ట‌ల్‌ను అడ్డుపెట్టుకొని చేసిన అక్ర‌మాలపైనా క‌మిటీ కూపీ లాగ‌నుంది. రాజ‌న్న సిరిసిల్లలో అసైన్ భూముల కొనుగోళ్లు, ప్ర‌భుత్వ భూముల కేటాయింపుల‌పైనా దృష్టి సారిస్తుంది. రాజ‌న్న సిరిసిల్లలోనే మిడ్ మానేరు రిజ‌ర్వాయ‌ర్ పున‌రావాస ప్యాకేజీల‌కు సంబంధించి బోయిన్‌ప‌ల్లి మండ‌లం ప‌రిధిలో జోగినిప‌ల్లి ర‌వీంద‌ర్ రావు, జే.సౌమ్యలపై ఉన్న ఆరోప‌ణ‌ల‌పైనా విచార‌ణ జ‌రుపుతుంది. ఈ భూముల‌న్నీ స‌క్ర‌మమా… అక్ర‌మమా… అనేది తేల్చి… స‌మ‌గ్ర నివేదిక‌ను ప్ర‌భుత్వానికి వీలైనంత త్వ‌ర‌లో ఇవ్వాల‌ని సీఎస్ సంజ‌య్ జాజు ప్ర‌భుత్వం త‌ర‌ఫున 134 జీవోను జారీచేశారు.

Leave A Reply

Your email address will not be published.