న్యూయార్క్ (అమెరికా):
యూఎన్‌జీఏలో అక్షరాస్యత సంస్కరణపై న్యూయార్క్‌లో జరుగుతున్న గ్లోబల్ డైలాగ్‌లో తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి డా. యోగితా రాణా పాల్గొన్నారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సందర్భంగా న్యూయార్క్‌లో నిర్వహించిన ప్రభుత్వ భాగస్వామ్యాలు, వ్యవస్థాగత మార్పు, అక్షరాస్యత సంస్కరణ అంశంపై జరిగిన మంత్రుల స్థాయి బ్రేక్‌ఫాస్ట్ సమావేశంలో యోగితా రాణా ప్రసంగించారు. ప్రభుత్వ వ్యవస్థల్లో ప్రాథమిక అక్షరాస్యత మరియు సంఖ్యా పరిజ్ఞానం సంస్కరణలను పెద్ద స్థాయిలో ఎలా అమలు చేయాలి, వాటిని ప్రభుత్వ వ్యవస్థల్లో శాశ్వతంగా ఎలా భాగం చేయాలి అనే అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. భారత్‌తో పాటు ఇథియోపియా, కెన్యా, రువాండా, కంబోడియా దేశాలకు చెందిన సీనియర్ ప్రభుత్వ ప్రతినిధులు, విద్యారంగ నిపుణులు ఈ చర్చలో పాల్గొన్నారు. గ్లోబల్ స్కూల్స్ ఫోరం సభ్యులతో పాటు పలు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు కూడా హాజరయ్యారు.
ఈ చర్చలో డా. యోగితా రాణా మాట్లాడుతూ, ప్రభుత్వ యాజమాన్యం, విశ్వసనీయ భాగస్వామ్యాలు, నిరంతర అమలు ద్వారా విద్యా సంస్కరణలను పెద్ద స్థాయిలో ఎలా ముందుకు తీసుకెళ్లవచ్చో వివరించారు. ప్రాథమిక విద్యను విద్యావ్యవస్థలోని ఒక ప్రత్యేక కార్యక్రమంగా కాకుండా, విద్యాశాఖలోని ప్రతి అంశంలో అంతర్భాగంగా చూడాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. టీచర్ శిక్షణ, విద్యార్థుల మూల్యాంకనం, అకడమిక్ మెంటరింగ్, విద్యార్థుల హాజరు, సాంకేతిక పరిజ్ఞానం వంటి ప్రతి అంశంతో ప్రాథమిక అభ్యాసాన్ని అనుసంధానం చేయాలని ఆమె వివరించారు. విద్యార్థుల వ్యక్తిగత అభ్యాస అవసరాలను గుర్తించడంలో సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. విద్యా సంస్కరణల ఫలితాలు ఒక వ్యక్తిపై ఆధారపడకుండా, సంస్థాగత వ్యవస్థలో భాగంగా మారేలా సంస్కరణలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. తెలంగాణలో ప్రతి చిన్నారికి మెరుగైన ప్రాథమిక అభ్యాస ఫలితాలను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.