ఢిల్లీ (మెట్రో న్యూస్):
23న పిటీషన్ విచారిస్తామని వెల్లడి.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటిషన్‌పై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ ఫిరాయింపుల కేసులో రాష్ట్ర హైకోర్టు తనపై వేటు వేయడాన్ని దానం నాగేందర్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. సోమవారం పిటీషన్ అంశాన్ని దానం తరఫున సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గి ప్రస్తావించారు. ఈ కేసులో అత్యవసరంగా విచారణ చేపట్టాలని… హైకోర్టు తీర్పును నిలుపుదల చేయాలని.. లేదంటే అసెంబ్లీ సీటుకు ఉప ఎన్నిక వచ్చే ప్రమాదం పొంచి ఉందని ఆయన నివేదించారు. దీంతో ప్రతివాదులు బీఆర్ఎస్, బీజేపీ తరఫు న్యాయవాదులు.. ఈ పరిస్థితి వస్తుందనే.. కేవియట్ వేశామని.. తమ వాదనలు కూడా వినాలని కోర్టును అభ్యర్థించారు. ఇప్పటికప్పుడు కాకుండా మరో రోజు విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారమే జరపాలని దానం తరఫున న్యాయవాదులు కోర్టును కోరారు. ఇరు పక్షాలను విన్న ధర్మాసనం పిటీషన్‌ను అనుమతిస్తూ… బుధవారం విచారిస్తామని పేర్కొంది. హైకోర్టు తీర్పును గౌరవిస్తానని… సుప్రీం కోర్టుకు వెళ్లే ఉద్దేశం లేదని.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా… కొట్లాడతానని ప్రకటించిన దానం నాగేందర్.. యూటర్న్ తీసుకొని సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.