Take a fresh look at your lifestyle.

కేసీఆర్ ఫాంహౌస్ భూములపై విచారణ.. 30 రోజుల్లో నివేదిక: రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన

0 2
  • ఫామ్‌హౌస్‌లో 388 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని ఆరోపణ
  • నెల రోజుల్లో విచారణ పూర్తి చేయాలని అధికారులకు సూచన
  • ప్రభుత్వ భూమిని నిరుపేదలకు పంచుతామని సీఎం ప్రకటన
  • కల్వకుంట్ల కుటుంబానికి 439 ఎకరాలు ఉన్నాయని వెల్లడి

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు చెందిన ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌పై సమగ్ర విచారణకు ఆదేశిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. బుధవారం శాసనసభలో మాట్లాడిన ఆయన, ఈ విచారణను 30 రోజుల్లోగా పూర్తి చేసి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.

కేసీఆర్‌కు 700 ఎకరాల ఫామ్‌హౌస్ ఉందో లేదో నిగ్గుతేల్చాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అందులో 388 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, ఈ విషయాన్ని కేసీఆర్ ఎందుకు వెల్లడించలేదని ఆయన ప్రశ్నించారు. విచారణలో ఆ భూమి ప్రభుత్వానిదని తేలితే, దాన్ని నిరుపేదలకు పంచిపెడతామని సభలో స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా కల్వకుంట్ల కుటుంబానికి ఉన్న భూముల వివరాలను కూడా రేవంత్ రెడ్డి వెల్లడించారు. కేసీఆర్ కుటుంబానికి సిద్దిపేటలో 67.5 ఎకరాలు, కేటీఆర్ కుటుంబానికి 123 ఎకరాలు, హరీశ్‌రావు కుటుంబానికి 30 ఎకరాలు, కవిత కుటుంబానికి 37 ఎకరాల భూమి ఉన్నట్లు తెలిపారు. తొమ్మిది జిల్లాల పరిధిలోని 24 మండలాల్లో కల్వకుంట్ల కుటుంబానికి మొత్తం 439 ఎకరాల భూమి ఉందని ఆయన పేర్కొన్నారు.

జోగినపల్లి సంతోష్ కుమార్ కుటుంబానికి 79 ఎకరాలు, నవీన్ రావుకు 52 ఎకరాలు, కొండల్ రావుకు 48 ఎకరాల భూమి ఉందని వెల్లడించారు. కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్‌పై తాను బాంబులు ఎందుకు వేస్తానని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. నేనేమైనా బిన్ లాడెన్‌నా అని ఆయన ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు.

అదే సమయంలో, ఎల్బీనగర్ పరిధిలోని జీవో 118 కింద ఉన్న భూముల క్రమబద్ధీకరణపై కూడా సీఎం కీలక ప్రకటన చేశారు. ఈ సమస్యతో ఇబ్బందులు పడుతున్న సుమారు 9,500 మందికి త్వరలోనే శుభవార్త అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.