హైదరాబాద్ (మెట్రో న్యూస్):
జీఓ పత్రాలను కులసంఘాలకు
అందజేసిన మంత్రి పొన్నం
రాష్ట్రంలో 38 బీసీ కుల సంఘాల భవన నిర్మాణాలకు గతంలో కేటాయించిన రూ.88.50 కోట్ల నిధులకు సంబంధించి ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. కుల సంఘాల ఆత్మ గౌరవ భవనాలకు నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవో పత్రాలను గురువారం నాడు మినిస్టర్స్ క్వార్టర్స్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ వివిధ కుల సంఘాలకు అందేశారు. భవనాల నిర్వహణ, నిర్మాణాల పర్యవేక్షణ కోసం కొత్త కార్యవర్గాల ఎంపికకు సంబంధించి ప్రభుత్వం జీవో నంబర్ 14 తీసుకురావడం తెల్సిందే. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు, ఎంపీ సురేష్ షెట్కర్, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలమాయ దేవి, కార్పొరేషన్ చైర్మన్లు, బిసి సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలు, ఉపముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు భవన నిర్మాణాలను వేగవంతం చేస్తున్నాం అని వెల్లడించారు. కేటాయించిన నిధులతో కుల సంఘాలు వెంటనే భవన నిర్మాణాలు చేపట్టాలన్నారు. కార్తీక మాసంలోనే కుల సంఘాల భవనాలకు శంకుస్థాపనలు చేసుకోవాలని సూచిస్తున్నాం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రతి నెలా భవన నిర్మాణాల ప్రగతిపై సమీక్ష నిర్వహిస్తాం. నిర్మాణాల పురోగతిని నెలవారీగా పర్యవేక్షిస్తూ ప్రోగ్రెస్ రిపోర్టులు తీసుకుంటాం. భవన నిర్మాణాలను ఏడాది కాలంలో లేదా నిర్మాణ పరిస్థితులను బట్టి నిర్ణయించిన గడువులోగా పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి తెలిపారు. సింగిల్ విండో విధానంలో అనుమతులు మంజూరు చేసి నిర్మాణాల్లో జాప్యం లేకుండా చర్యలు తీసుకుంటాం అని పేర్కొన్నారు. బీసీ విద్యార్థుల స్కిల్ డెవలప్మెంట్, వసతి సౌకర్యాలు, కుల సంఘాల సామాజిక కార్యక్రమాలకు ఈ భవనాలు ఉపయోగపడాలన్నారు.