Take a fresh look at your lifestyle.

ఖేలో ఇండియా యూత్ గేమ్స్ జాతీయ స్థాయి క్రీడా పోటీలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

0 3

( మెట్రో న్యూస్)

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026-27 కార్యక్రమంలో భాగంగా డిసెంబర్ నెలలో జాతీయ స్థాయిలో నిర్వహించనున్న క్రీడా పోటీలకు సంబంధించి నిజామాబాద్ జిల్లాలో ఎంపిక చేసిన క్రీడా వేదికను కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం పరిశీలించారు.
జాతీయ స్థాయిలో మొత్తం 20 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనుండగా, టేబుల్ టెన్నిస్ పోటీల నిర్వహణకు నిజామాబాద్ జిల్లాను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో కలెక్టర్ మాక్లూర్ మండలం దాస్‌నగర్ సమీపంలోని నవ్య భారతి గ్లోబల్ స్కూల్‌ను సందర్శించి, టేబుల్ టెన్నిస్ పోటీల నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలు, క్రీడా వేదిక, ఇతర వసతులను పరిశీలించారు. అనంతరం సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి, చేపట్టాల్సిన ఏర్పాట్లపై సూచనలు చేశారు.
దేశవ్యాప్తంగా సుమారు 150 మంది టేబుల్ టెన్నిస్ క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనేందుకు జిల్లాకు రానున్న నేపథ్యంలో, అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జాతీయ స్థాయి క్రీడా పోటీల నిర్వహణకు నిజామాబాద్ జిల్లాను ఎంపిక చేయడం ఎంతో ప్రతిష్టాత్మకమైన విషయమని పేర్కొంటూ, ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగాలని సూచించారు.
క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను సమకూర్చాలని, వారి భద్రతకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. దాదాపు ఐదు రోజుల పాటుuపోటీలు కొనసాగనున్నందున, క్రీడాకారుల వసతి, భోజనం, తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య సేవలు తదితర సదుపాయాలను సమన్వయంతో ఏర్పాటు చేయాలని సూచించారు.
జాతీయ స్థాయి క్రీడా పోటీలను జిల్లాలో విజయవంతంగా నిర్వహించడం ద్వారా నిజామాబాద్ జిల్లాకు మంచి గుర్తింపు తీసుకురావాలని, ఇందుకోసం సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి హితవు పలికారు. క్రీడా పోటీల నిర్వహణ కోసం ఇంకనూ ఏవైనా సదుపాయాలు అవసరమైతే ప్రతిపాదనలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ భుజంగరావు, నిజామాబాద్ ఆర్దీఓ రాజేంద్ర కుమార్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఇంచార్జి డీఈఓ సాయాగౌడ్, జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి పవన్ కుoమార్, డీఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి పరమేశ్వర్, నిజామాబాద్ ఏసీపీ ప్రకాశ్ యాదవ్, నవ్య భారతి స్కూల్ కరస్పాండెంట్ సంతోష్, లత, స్థానిక అధికారులు, తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.