Take a fresh look at your lifestyle.

తమిళనాడులో సీఎం విజయ్‌కు బూస్ట్‌.. రెండు ఉప ఎన్నికల్లోనూ టీవీకే ఘన విజయం!

0 16
  • మదురాంతకంలో మరగతం కుమరవేల్‌ 17,554 ఓట్ల మెజారిటీతో విజయం
  • ధారాపురంలో 10,196 ఓట్ల మెజారిటీతో గెలిచిన సత్యభామ
  • అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి టీవీకేలో చేరడంతో అనివార్యమైన ఉపఎన్నికలు
  • 4 నెలలుగా చేసిన పనులకు ప్రజలు ఇచ్చిన మద్దతుగా టీవీకే నేతల అభివర్ణన
  • ఈ విజయాలతో విజయ్‌ ప్రభుత్వానికి రాజకీయంగా ఊరట

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీకి ఉప ఎన్నికల్లో భారీ విజయం దక్కింది. మధురాంతకం, ధారాపురం అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లోనూ ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. రెండు స్థానాల్లోనూ ప్రధాన ప్రత్యర్థి డీఎంకే రెండో స్థానానికే పరిమితమైంది. ఈ ఫలితాలు విజయ్‌ ప్రభుత్వానికి రాజకీయంగా మరింత బలాన్ని ఇచ్చాయి.

మధురాంతకం నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థి మరగతం కుమరవేల్‌ 17,554 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆమెకు 61,470 ఓట్లు రాగా, డీఎంకే అభ్యర్థి పరంధామన్‌కు 43,916 ఓట్లు వచ్చాయి. అన్నాడీఎంకే అభ్యర్థి గణిత సంపత్‌ 38,770 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 27 మంది పోటీ చేయగా, 86.26 శాతం పోలింగ్‌ నమోదైంది.

ధారాపురంలోనూ టీవీకే అభ్యర్థి సత్యభామ విజయకేతనం ఎగురవేశారు. ఆమెకు 62,596 ఓట్లు రాగా, డీఎంకే అభ్యర్థి సుకన్యకు 52,400 ఓట్లు వచ్చాయి. దీంతో సత్యభామ 10,196 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అన్నాడీఎంకే అభ్యర్థి భానుమతి 41,078 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. ఇక్కడ 22 మంది అభ్యర్థులు పోటీ చేయగా, 80.30 శాతం ఓటింగ్‌ నమోదైంది.

ఈ రెండు స్థానాలకు ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. గతంలో అన్నాడీఎంకే తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి టీవీకేలో చేరారు. దీంతో ఖాళీ అయిన స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. టీవీకే, డీఎంకే, అన్నాడీఎంకేతో పాటు వామపక్షాలు, నామ్‌ తమిళర్‌ కట్చి కూడా పోటీలో నిలిచాయి.

ఈ విజయాలు తమ ప్రభుత్వం గత నాలుగు నెలలుగా చేసిన పనులకు ప్రజలు ఇచ్చిన మద్దతుగా టీవీకే నేతలు అభివర్ణించారు. ఎన్నికల ప్రచారంలో హోరాహోరీ పోటీ నెలకొన్న నేపథ్యంలో రెండు స్థానాలనూ గెలుచుకోవడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. మరోవైపు, రెండు చోట్లా ఓటమి పాలైన డీఎంకే, అన్నాడీఎంకే తమ ఫలితాలను సమీక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఉప ఎన్నికలు రెండు స్థానాలకే పరిమితమైనా, విజయ్‌ ప్రభుత్వానికి రాజకీయంగా మరింత ప్రోత్సాహాన్నిచ్చాయి.

Leave A Reply

Your email address will not be published.