హైదరాబాద్ (మెట్రో న్యూస్):
- ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ తెచ్చిన కరువే
- మాజీ మంత్రి హరీశ్ రావు ధ్వజం
రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్లు.. రాష్ట్రంలో 12 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయి రైతులు కన్నీరు పెడుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొద్దునిద్ర పోతున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. కరోనా విపత్తులో కేసీఆర్ ప్రజలకు రక్షణ కవచంలా నిలబడి కోటి టన్నుల పంట పండిస్తే.. ఎల్‌నినో పేరిట రేవంత్ రెడ్డి క్రాప్ హాలిడే ప్రకటించి రైతులను శిక్షిస్తున్నారని మండిపడ్డారు. 10 నెలల ముందే శాస్త్రవేత్తలు హెచ్చరించినా బొగ్గు నిల్వలు, విద్యుత్ కొనుగోళ్లు చేయకుండా చేతులు కాలాక అధికారులపై చిందులు వేస్తున్నారు.. సస్పెండ్ చేయాల్సింది అధికారులను కాదు, అసమర్థ సీఎంను, విద్యుత్ మంత్రిని అని అన్నారు. కేసీఆర్‌కు పేరు వస్తుందనే రాజకీయ అక్కసుతో కన్నెపల్లి మోటార్లు ఆన్ చేయకుండా, దేవాదుల, కల్వకుర్తి మోటార్లను 24 గంటలు నడపకుండా సాగునీటి కరువు సృష్టించారని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఆరోపించారు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బూరుగుపల్లి గ్రామంలో సాగునీరు, కరెంటు అందక ఎండిపోయిన వరి పంట పొలాలను మాజీ మంత్రి గురువారం నాడు సందర్శించి పరిశీలించారు. చేతికొచ్చే దశలో ఎండిపోయిన పొలాలను చూపుతూ కన్నీరుమున్నీరైన బాధిత రైతులను ఆయన ఓదార్చి ధైర్యం చెప్పారు. అనంతరం రైతులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఘోర వైఫల్యం వల్ల వానాకాలంలోనే దాదాపు 12 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయి రైతులంతా తీవ్ర ఆందోళనలో ఉంటే, ఈ ప్రభుత్వం మాత్రం మొద్దునిద్ర పోతోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇంతవరకు కరువు మండలాలు ప్రకటించలేదు, పైసా సాయం చేయలేదని విమర్శించారు. రాష్ట్రంలో తక్షణమే కరువు మండలాలను ప్రకటించి, ఎండిపోయిన 12 లక్షల ఎకరాల పంటలకు నష్టపరిహారం అందించాలి. రైతు కూలీలకు వెంటనే రూ. 12,000 విడుదల చేయాలన్నారు. ప్రజలపై మోపిన రూ. 5,420 కోట్ల విద్యుత్ భారాన్ని, పెంచిన బస్సు చార్జీలను తక్షణమే ఉపసంహరించుకుని, నిత్యావసరాల ధరలను నియంత్రించాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు.