Take a fresh look at your lifestyle.

కండక్టర్‌గా సీఎం విజయ్.. బస్సులో మహిళలకు స్వయంగా టికెట్ల పంపిణీ.. ఇదిగో వీడియో!

0 18
  • తమిళనాడులో మహిళల ఉచిత బస్సు పథకం ‘వెట్రి పయనం’ విస్తరణ
  • గాంధీ జయంతి సందర్భంగా పథకాన్ని ప్రారంభించిన సీఎం విజయ్
  • ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులకు కూడా వర్తించనున్న ఉచిత ప్రయాణం
  • ఈ పథకంతో రోజుకు 84 లక్షల మంది మహిళలకు ప్రయోజనం
  • మహిళలతో పాటు ట్రాన్స్‌జెండర్లకు కూడా ఈ పథకం వర్తింపు

తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని మరింత విస్తరించారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని నేడు ‘వెట్రి పయనం’ పేరుతో ఈ విస్తృత పథకాన్ని ఆయన ప్రారంభించారు. చెన్నైలోని కోయంబేడు బస్ టెర్మినస్‌లో జరిగిన కార్యక్రమంలో సీఎం స్వయంగా మహిళా ప్రయాణికులకు ఉచిత టికెట్లు అందజేసి పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

ఇప్పటివరకు సాధారణ సిటీ, టౌన్ బస్సులకే పరిమితమైన ఈ పథకాన్ని ఇప్పుడు మరిన్ని సర్వీసులకు వర్తింపజేశారు. దీని ప్రకారం, ఇకపై మెట్రోపాలిటన్, పట్టణ ప్రాంతాల్లో నడిచే ఎక్స్‌ప్రెస్, లిమిటెడ్ స్టాప్ సర్వీస్ (ఎల్ఎస్ఎస్‌), డీలక్స్ బస్సుల్లో కూడా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. అలాగే 40 కిలోమీటర్లు దాటిన మొఫుసిల్ ఆర్డినరీ, కొండ ప్రాంతాల్లోని ఆర్డినరీ బస్సులకు కూడా ఈ పథకం వర్తిస్తుంది.

ఈ విస్తరణతో రాష్ట్రంలోని ఏడు ప్రభుత్వ రవాణా సంస్థలకు చెందిన మొత్తం 12,692 బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఇది మొత్తం బస్సుల్లో సుమారు 69 శాతం. ఈ పథకం ద్వారా ప్రతిరోజూ సుమారు 84.32 లక్షల మంది మహిళలు లబ్ధి పొందుతారని అంచనా వేస్తున్నారు.

ఉద్యోగాలు, కళాశాలలు, ఇతర పనుల కోసం ప్రయాణించే మహిళల ఖర్చులను తగ్గించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. దీనికి ఎలాంటి ఆదాయ పరిమితి గానీ, ప్రయాణాలపై పరిమితి గానీ లేదు. మహిళలతో పాటు ట్రాన్స్‌జెండర్లకు కూడా ఈ సౌకర్యం వర్తిస్తుంది. అయితే, ‘స్టేట్ ఎక్స్‌ప్రెస్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్’ (ఎస్ఈటీసీ) బస్సులకు ఈ పథకం నుంచి మినహాయింపు ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.