హైదరాబాద్ (మెట్రో న్యూస్):
సింగపూర్ వాణిజ్య-పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన ఇంధన వాణిజ్య విభాగం శాశ్వత కార్యదర్శి అగస్టిన్ లీ బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అసెంబ్లీలో భేటీ అయ్యారు. తెలంగాణలో సెమీ కండక్టర్ల పరిశ్రమ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు సింగపూర్ ప్రతినిధులు ఈ సందర్భంగా సీఎంకు తెలిపారు. ఇతర రంగాలలోనూ పెట్టుబడులపై సింగపూర్ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. మూసీ పునరుజ్జీవనం, ఫ్యూచర్స్ సిటీ అభివృద్ధి అంశాలను సింగపూర్ ప్రతినిధులకు సిఎం వివరించారు.

తొలిదశలో మూసా, ఈసా నదుల సంగమం, గాంధీ సరోవర్ వరకు మూసీ పునరుజ్జీవనం చేపట్టనున్నట్లు తెలియజేశారు. రివర్ ఫ్రంట్ అభివృద్ధితో పాటు, నైట్ ఎకానమీ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ముఖ్యమంత్రి చెప్పారు. హైదరాబాద్ నగరాన్ని కేవలం పర్యాటకంగానే కాకుండా నాలెడ్జ్ హబ్ గా తీర్చి దిద్దుతున్నామన్నారు. ఇప్పటికే హార్వార్డ్, ఆక్స్ ఫర్డ్ వర్సిటీ, ఎంఐటీ, లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తమ తమ ఆఫ్ షోర్ క్యాంపస్ ను హైదరాబాదులో ఏర్పాటు చేసేందుకు అంగీకరించాయని సీఎం తెలిపారు.
భారత్ ఫ్యూచర్ సిటీని నెట్ జీరో సిటీగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడంతో పాటు, రాష్ట్ర అభివృద్ధికి ఆర్ధిక పరమైన సహకారం అందించాలని కోరారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అన్నిరకాలుగా ప్రభుత్వం సహకరిస్తుందని సీఎం పేర్కొన్నారు. ఈ సందర్భంగా సింగపూర్ ప్రతినిధులను ఫ్యూచర్ సిటీలో డిసెంబరులో నిర్వహించే తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కు రావాలని ముఖ్యమంత్రి ఆహ్వానించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారావు, దక్షిణాసియా సీనియర్ డైరెక్టర్ డాక్టర్ ఫ్రాన్సిస్ చోంగ్, కాన్సుల్-జనరల్ విలియం చిక్, ఇతర సింగపూర్ ప్రతినిధులు పాల్గొన్నారు.