Take a fresh look at your lifestyle.

‘శుద్ధీకరణ’ ఘటనపై ఖర్గే ఆవేదన.. పార్టీ నేతల మౌనంపై అసంతృప్తి

0 13
  • హల్ద్వానీ శుద్ధీకరణ ఘటనపై సీడబ్ల్యూసీలో ఖర్గే ఆవేదన
  • తనకు పార్టీ నేతల నుంచి తగిన మద్దతు రాలేదని అసంతృప్తి
  • సభా వేదిక శుద్ధీకరణ తనను అవమానించిందని రాజ్యసభలో ఆవేదన
  • బాధ్యులపై అంటరానితనం నిరోధక చట్టం కింద చర్య తీసుకోవాలని విన్నపం
  • ఘటన దురదృష్టకరమన్న జేపీ నడ్డా

ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో తన సభ జరిగిన ప్రదేశాన్ని శుద్ధి చేయడంపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనను ఖండిస్తూ కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ)లోని పలువురు నేతలు బహిరంగంగా స్పందించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలను ఉటంకిస్తూ ఎన్డీటీవీ వెల్లడించింది.

ఆగస్టు 8న హల్ద్వానీలోని రామ్‌లీలా మైదానంలో ఖర్గే ‘విజయ్‌ శంఖనాద’ సభలో పాల్గొన్నారు. రెండు రోజుల తర్వాత ఆగస్టు 10న ‘శ్రీరామ్‌ సేన’కు చెందిన కార్యకర్తలు అక్కడ శుద్ధి హోమం నిర్వహించారు. ఈ ఘటనపై కాంగ్రెస్‌ తీవ్రంగా స్పందించింది.

ఢిల్లీలో బుధవారం జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో ఖర్గే ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు సమాచారం. ఘటన జరిగిన తర్వాత పలువురు సీడబ్ల్యూసీ సభ్యులు తనకు బహిరంగంగా మద్దతు ఇవ్వలేదని ఆయన బాధపడ్డారని పార్టీ వర్గాలు తెలిపాయి.

అయితే ఖర్గే ఎవరినీ ప్రత్యేకంగా పేరుపెట్టి విమర్శించలేదని సమాచారం. కొందరు సీనియర్‌ నేతలు ఈ ఘటనపై గట్టిగా స్పందించకపోవడంపై ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు సమావేశంలో వ్యవహరించిన తీరును బట్టి తెలుస్తోందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

ఈ అంశాన్ని ఖర్గే గురువారం రాజ్యసభలో కూడా ప్రస్తావించారు. హల్ద్వానీలో తన సభ వేదికను శుద్ధి చేయడం తనను అవమానించినట్లుగా అనిపించిందని అన్నారు. “నన్ను రక్షించండి అని ఎవరినీ అడగలేదు. నాకు పోరాడే శక్తి ఉంది. పోరాడుతూనే ఉంటాను. కానీ హల్ద్వానీలో వేదికను శుద్ధి చేయడం వల్ల అంటరానితనం బాధను అనుభవించాను” అని ఖర్గే పేర్కొన్నారు.
ఈ ఘటనకు బాధ్యులపై అంటరానితనం నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ఖర్గే వ్యాఖ్యలపై రాజ్యసభలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా స్పందించారు. హల్ద్వానీ ఘటన దురదృష్టకరమని అన్నారు. ఈ ఘటనలో బీజేపీ నేతలు, కార్యకర్తలకు సంబంధం లేదని స్పష్టం చేశారు. దీనిపై విచారణ జరుపుతామని హామీ ఇచ్చారు.

మరోవైపు కాంగ్రెస్‌ మాత్రం శుద్ధీకరణ కార్యక్రమం నిర్వహించిన వారికి బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌తో సంబంధాలు ఉన్నాయని ఆరోపించింది. ఈ ఘటన వెనుక దళితుల పట్ల వివక్షతో కూడిన ఆలోచనా ధోరణి ఉందని విమర్శించింది. బీజేపీ మాత్రం ఆ కార్యక్రమానికి దూరంగా ఉంటూ శుద్ధీకరణ చర్యను ఖండించింది.

Leave A Reply

Your email address will not be published.