హైదరాబాద్ (మెట్రో న్యూస్):
- కల్వకుంట్ల కుటుంబం లక్ష కోట్ల భూదోపిడీ
- కేసీఆర్ కుటుంబానికి 439.30 ఎకరాలు
- ప్రభుత్వ భూములతో ఎర్రవల్లి ఫామ్‌హౌస్
- మాజీ ముఖ్యమంత్రి ఫామ్‌హౌస్‌పై విచారణకు సీఎం ఆదేశం
- 30 రోజుల్లో ఎర్రవల్లి ఫామ్‌హౌస్ లెక్కలు తేల్చాలి
- మాజీ సీఎంకు నోటీసిలివ్వాలని కలెక్టర్‌కు ఆదేశాలు
- ప్రభుత్వ భూములని తేలితే స్వాధీనం చేసుకుంటాం
- ఆ భూములను దళితులకు పంచిపెడతాం
- ధరణి అడ్డంపెట్టుకొని గత ప్రభుత్వం
విచ్చలవిడిగా భూకబ్జాలు
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుటుంబం లక్ష కోట్ల భూదోపిడీకి తెగబడిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ధరణి పోర్టల్‌ని అడ్డంపెట్టుకొని రాష్ట్రంలో వందలాది ఎకరాల భూములను కొల్లగొట్టారని ఫైర్ అయ్యారు. ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని కేసీఆర్ ఎర్రవల్లిలో ఫామ్‌హౌస్ నిర్మించుకున్నారన్న ఆరోపణల నిగ్గు తేల్చేందుకు అసెంబ్లీ వేదికగా సీఎం విచారణకు ఆదేశించారు. తక్షణమే కేసీఆర్‌కు నోటీసులిచ్చి 30 రోజుల్లో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్‌కు డెడ్‌లైన్ విధించారు. ఫామ్‌హౌస్‌లో భాగంగా 388 ఎకరాలు ప్రభుత్వ భూములున్నట్టు సమాచారం ఉందని, అదే నిజమైతే… ఆ భూములను స్వాధీనం చేసుకొని… దళితులకు పంచిపెడతామని ముఖ్యమంత్రి చెప్పారు.
బుధవారం మధ్యాహ్నం 1.10 నిముషాలకు 22ఏ అంశంపై చర్చలో భాగంగా మాట్లాడిన ముఖ్యమంత్రి… దాదాపు మూడు గంటల పాటు సుదీర్ఘంగా ప్రసంగించారు. 22ఏ అంశంపై తమ ప్రభుత్వాన్ని బదనాం చేస్తూ… ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్న కేసీఆర్ ఫ్యామిలీ, బీఆర్ఎస్ నాయకులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ధరణి తీసుకొచ్చిన కేసీఆర్ తన కుటుంబ సభ్యులు, బినామీల పేరిట వందలు, వేల ఎకరాల దోపిడీకి పాల్పడ్డారన్నారు. ఒక్కక్కరి పేరిట రికార్డులలో ఉన్న భూముల వివరాలను చదివి వినిపించారు. కేసీఆర్ , కేటీఆర్, కవిత, హరీశ్‌రావు, సంతోష్‌కుమార్, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్ కుటుంబ సభ్యులకు కలిపి 9 జిల్లాలలో 24 మండలాల వ్యాప్తంగా 31 గ్రామాలలో విస్తరించి 439.30 ఎకరాలు ఉన్నాయని సీఎం ప్రకటించారు.
తెలంగాణ ఉద్యమంలో పోరాడిన వారంతా ఉన్న ఆస్తులు కోల్పోతే.. ఒక్క కల్వకుంట్ల కుటుంబమే వందల ఎకరాలను దోచుకుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో 388 ఎకరాలు ప్రభుత్వ భూములున్నాయని పక్కా ఆధారాలున్నాయన్నారు. సత్యం రామలింగరాజు కంపెనీ భూముల్లోనే కేటీఆర్ జన్వాడా ఫామ్‌హౌస్ నిర్మించుకున్నారన్నారు. ఇక హరీశ్‌రావు కూడా రంగనాయకసాగర్ రిజర్వాయర్ భూసేకరణ భూములలో ఫామ్‌హౌస్ కట్టుకున్నారని తెలిపారు. మాజీ మంత్రులు గంగుల, జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి తదితరులకు వందలాది ఎకరాలు ప్రభుత్వ భూములను ధారాదత్తం చేశారన్నారు. ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డిలు కూడా అక్రమ భూములు కొన్నారన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలలో బీఆర్ఎస్ నాయకులకు వేలాది ఎకరాలు అక్రమంగా దోచిపెట్టారన్నారు. అన్నీ బయటకు తీస్తామన్నారు.