హైదరాబాద్ (మెట్రో న్యూస్):
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో తీవ్రంగా చెలగాటమాడుతోందని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలపై కాలయాపన చేయకుండా స్పష్టమైన ప్రకటన చేయాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు డిమాండ్ చేశారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నిన్న అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బీజేపీ ఎందుకు ప్రశ్నించలేదని అనడం పూర్తి అవాస్తవమని ఖండించారు.
సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా విద్యాశాఖను తన వద్దే ఉంచుకుని, తెలంగాణ విద్యావ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేశారని ఆరోపించారు. 2026 నాటికి పాత, కొత్త బకాయిలు అన్నీ కలిసి ఫీజు బకాయిలు సుమారు రూ. 15 వేల కోట్లకు చేరుకున్నాయని మండిపడ్డారు మరోవైపు పాలిటెక్నిక్ విద్యార్థుల జీవితాలను కాంగ్రెస్ సర్కార్ అంధకారంలోకి నెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జీవో 97 ద్వారా స్కిల్ డెవలప్మెంట్ను ఇంటిగ్రేట్ చేసి, పాలిటెక్నిక్ డిగ్రీనే పూర్తిగా ఎత్తేసే కుట్ర జరుగుతోందని, వారికి ఈ-సెట్ రాసే అర్హత ఉంటుందో లేదో ఇప్పటికీ ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని తెలిపారు. తమ భవిష్యత్తు కోసం శాంతియుతంగా ధర్నా చేస్తున్న పాలిటెక్నిక్ విద్యార్థులపై పోలీసులతో క్రూరంగా లాఠీచార్జ్‌లు చేయించడం అమానుషమన్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం బీజేపీ కార్యకర్తలు నేరుగా కాలేజీలకు వెళ్లి సుమారు 8 లక్షల మంది విద్యార్థుల నుంచి స్వయంగా సంతకాలు సేకరించారని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే బీజేపీ ప్రభుత్వమే విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలన్నింటినీ పూర్తిగా విడుదల చేస్తుందని స్పష్టమైన భరోసా ఇచ్చారు.