సింగరేణి సంస్థ విశ్రాంత ఉద్యోగులు వైద్య సేవలను నిరంతరాయంగా పొందాలంటే ప్రతి ఏడాది నవంబరు నెలలో జీవిత ధ్రువీకరణ పత్రాన్ని అంతర్జాలం ద్వారా పునరుద్ధరించుకోవడం తప్పనిసరి అని మందమర్రి ఏరియా డీజీఎం (వ్యక్తిగత విభాగం) సీహెచ్. అశోక్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
గత నవంబరు నెలలో జీవిత ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించకపోవడంతో మందమర్రి ఏరియాకు చెందిన 1,057 మంది విశ్రాంత ఉద్యోగులు ప్రస్తుతం వైద్య సేవలను పొందలేకపోతున్నారని తెలిపారు. విశ్రాంత ఉద్యోగులు తమ జీవిత ధ్రువీకరణ పత్రం సమర్పించారా లేదా అనే విషయాన్ని వెంటనే పరిశీలించుకోవాలని సూచించారు.
ఇప్పటివరకు జీవిత ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించని వారు, సాంకేతిక కారణాల వల్ల ప్రక్రియ పూర్తికాని వారు ఎవరైనా ఉంటే వెంటనే అంతర్జాలం ద్వారా సమర్పించాలని కోరారు. జీవిత ధ్రువీకరణ పత్రం సమర్పించిన అనంతరం వైద్య సేవలను తిరిగి పొందే అవకాశం ఉంటుందని తెలిపారు.
సింగరేణి విశ్రాంత ఉద్యోగుల వైద్య పథకం ద్వారా వైద్య సహాయం పొందుతున్న వారంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీహెచ్. అశోక్ కోరారు.