హైదరాబాద్ (మెట్రో న్యూస్):
తెలంగాణలో క్రీడలను విద్యతో అనుసంధానం చేసి, అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడాకారులను తీర్చిదిద్దే లక్ష్యంతో యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. శాసనమండలిలో సభ్యులు బల్మూర్ వెంకట నర్సింగరావు, మహేష్ కుమార్, శ్రీపాల్ రెడ్డి, అడిగిన ప్రశ్నలకు మంత్రి వాకిటి సమాధానం ఇచ్చారు.
యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను గుర్తించి, వారికి శాస్త్రీయ శిక్షణ, అత్యుత్తమ కోచింగ్ అందించడంతో పాటు స్పోర్ట్స్ సైన్స్, స్పోర్ట్స్ మెడిసిన్, ఫిజికల్ ఎడ్యుకేషన్, పరిశోధన వంటి విభాగాలను ఒకే వేదికపైకి తీసుకురావడమే క్రీడా విశ్వవిద్యాలయం ప్రధాన లక్ష్యమని మంత్రి వివరించారు. కొరియా నేషనల్ స్పోర్ట్ యూనివర్సిటీతో సహకారానికి సంబంధించిన చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. బిఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో కేటాయించిన మొత్తం కంటే ఈ ఒక్క ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వ క్రీడా బడ్జెట్ ఎక్కువగా ఉందని తెలిపారు. క్రీడా అకాడమీల సంఖ్య 6 నుంచి 19కి పెరిగాయన్నారు. డిసెంబర్ 11 నుండి 22 వరకు 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 నిర్వహణ ను 272 కోట్ల అంచనా వ్యయంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించబోతోందని తెలియజేశారు.