(మెట్రో న్యూస్)
మెట్ పల్లి మండలం జగ్గసాగర్ ఆత్మకూర్ గ్రామాల్లోని పాఠశాలలను కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో విద్యార్థులకు అందుతున్న విద్యాబోధన, మౌలిక సదుపాయాలు, పాఠశాల నిర్వహణ తదితర అంశాలను ఆయన పరిశీలించారు. అనంతరం పదవ తరగతి విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడి వారి చదువుల పురోగతిని, పరీక్షలకు చేస్తున్న సన్నద్ధతను అడిగి తెలుసుకున్నారు. పదవ తరగతి విద్యార్థులు ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా చదువుతూ మంచి మార్కులు సాధించాలని, ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని కష్టపడి చదవాలని వారికి దిశా నిర్దేశం చేశారు. విద్యార్థులకు ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యాబోధన అందిస్తూ, పదవ తరగతి ఫలితాల్లో మంచి ఉత్తీర్ణత సాధించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది పడేలా అందరూ సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే డా. సంజయ్ కల్వకుంట్ల పేర్కొన్నారు.