Take a fresh look at your lifestyle.

మల్లన్న సాగర్‌ను కూల్చేందుకు కుట్ర

0 2

సిద్దిపేట (మెట్రో న్యూస్‌):

మ‌ల్ల‌న్న సాగ‌ర్ క‌ట్ట‌ను కూల్చేందుకు రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం కుట్ర‌కు పాల్ప‌డుతోందని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. క‌ట్ట‌కు కేవ‌లం 150 మీట‌ర్ల దూరంలోనే అర్థ‌రాత్రి పూట అక్రమ పేలుళ్లు జ‌రుగుతున్నాయ‌ని ఆరోపించారు. మూసీ సుందరీకరణ నీళ్ల కోసం ఎలాంటి అనుమతులు లేకుండా మల్లన్న సాగర్ కట్ట సమీపంలోనే 20 మీటర్ల లోతున అడ్డగోలు బ్లాస్టింగ్స్ చేస్తుండటంతో రిజర్వాయర్ కట్ట అదురుతోంద‌ని, సీపేజీ పెరుగుతున్నద‌ని అన్నారు. సిద్దిపేట జిల్లా తిప్పారం గ్రామ‌స్తుల ఫిర్యాదు మేర‌కు మాజీ మంత్రి హ‌రీశ్‌రావు పార్టీ నాయ‌కుల‌తో క‌లిసి గురువారం మ‌ల్ల‌న్న సాగ‌ర్ రిజ‌ర్వాయ‌ర్ క‌ట్ట‌ను, అక్ర‌మ బ్లాస్టింగ్ జ‌రుగుతున్న ప్రాంతాన్ని స్వ‌యంగా ప‌రిశీలించారు. అధికారులకు ఫోన్ చేస్తే ఎవరికీ పర్మిషన్ ఇచ్చినట్టు తెలియదంటున్నారు.. మరి అర్ధరాత్రి వేళ ఈ దొంగ బ్లాస్టింగ్స్ ఎవరి అండతో జరుగుతున్నాయని ప్ర‌శ్నించారు. తక్షణమే అక్రమ బ్లాస్టింగ్స్ ఆపి, బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేయాలని, ఏజెన్సీపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి బహిరంగ లేఖ రాస్తున్నామ‌న్నారు.

ఈ సందర్భంగా మల్లన్న సాగర్ కట్ట వద్ద మాజీ మంత్రి మీడియాతో మాట్లాడుతూ… కాళేశ్వరం ప్రాజెక్టు పైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొదటి నుంచీ కుట్రలు చేస్తోందన్న విషయం ఇక్కడి పరిస్థితులను చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. గతంలో మేడిగడ్డ బ్యారేజీలో రెండు పిల్లర్లు కుంగిపోవడం వెనుక కూడా బ్లాస్టింగ్ జరిగిందా అనే అనుమానాలు ప్రజల్లో బలంగా ఉన్నాయి. ఆనాడు ఇంజినీర్లు కూడా బ్లాస్టింగ్ జరిగిందని ఫిర్యాదు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇరిగేషన్ నిబంధనల ప్రకారం రిజర్వాయర్ కట్టను ఆనుకుని ఇలాంటి పనులు చేయకూడదు. ఇరిగేషన్ అనుమతి లేదు, పోలీస్ పర్మిషన్ లేదు, రెవెన్యూకు తెలియదు, గ్రామ పంచాయతీ తీర్మానం లేదు.. మరి ఎవరి అండతో అర్ధరాత్రి వేళ ఈ దొంగ బ్లాస్టింగ్స్ చేస్తున్నారు? ఇవన్నీ చూస్తుంటే మల్లన్న సాగర్ ప్రాజెక్టును దెబ్బతీయడానికి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కుట్ర చేస్తోందన్న బలమైన అనుమానాలు కలుగుతున్నాయని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.