దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ (బుధవారం) భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ దేశీయ సూచీలు నష్టపోతున్నాయి. ట్రేడింగ్ ప్రారంభంలో సెన్సెక్స్ 700 పాయింట్లకుపైగా క్షీణించింది. ఉదయం 10.20 గంటల సమయానికి సెన్సెక్స్ 933 పాయింట్ల నష్టంతో 72,665 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 236 పాయింట్లు క్షీణించి 22,512 వద్ద కొనసాగుతోంది.
నిఫ్టీ సూచీలో లార్సెన్, బజాజ్ ఆటో, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఎస్‌బీఐ, హిందాల్కో షేర్లు రాణిస్తున్నాయి. ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్, టెక్ మహీంద్రా, టీసీఎస్ స్టాక్స్ నష్టపోతున్నాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో బ్రెంట్ క్రూడ్ ఒక బ్యారెల్‌కు 115 డాలర్లపైకి చేరింది. ఈ ధరల పెరుగుదలే భారత మార్కెట్లకు ప్రతికూలంగా మారిందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మరోవైపు అగ్రరాజ్యం అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతుందని అంచనాలు ఉన్నాయి. అయితే ముడి చమురు ధరలు పెరుగుతుండటంతో ద్రవ్యోల్బణం పెరుగుతోంది. దాంతో ఇన్వెస్టర్‌లు అమ్మకాలకు మొగ్గుచూపుతున్నారు. ఫలితంగా దేశీయ మార్కెట్‌లు నష్టాలు మూటగట్టుకుంటున్నాయి.