రష్యా నుంచి ముడి చమురు దిగుమతులను తగ్గించాలంటూ అమెరికా తమపై ఎలాంటి ఒత్తిడి చేయలేదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి తెలిపారు. మంగళవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు, రాయితీల ఆధారంగానే చమురు కొనుగోళ్లపై నిర్ణయాలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.

రష్యా నుంచి భారత్‌ చమురు దిగుమతులు ఉక్రెయిన్‌ యుద్ధానికి ముందు చాలా తక్కువగా ఉండేవని పురి గుర్తుచేశారు. అప్పట్లో దేశ చమురు దిగుమతుల్లో రష్యా వాటా కేవలం 0.2 శాతమేనని చెప్పారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యా చమురుపై లభించిన రాయితీల కారణంగా దిగుమతులు పెరిగాయని వివరించారు.

అయితే, ఇటీవల పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోందని మంత్రి తెలిపారు. మధ్యప్రాచ్య దేశాల నుంచి చమురు సరఫరాలు పెరుగుతున్నాయని, ఆ ప్రాంతం నుంచి మరింత చమురు సరఫరా అవుతుందని పేర్కొన్నారు. సెప్టెంబర్‌లో మధ్యప్రాచ్య దేశాల నుంచి భారత్‌ దిగుమతులను పెంచుకుంది. అదే సమయంలో చైనా నుంచి పోటీ పెరగడం, గల్ఫ్‌ దేశాల చమురుపై రాయితీలు లభించడంతో భారత రిఫైనరీలు రష్యా చమురు కొనుగోళ్లను తగ్గించినట్లు నౌకల రవాణా గణాంకాలు వెల్లడించాయి.

రష్యా చమురు కొనుగోళ్లు ఇతర దేశాల చమురు ధరలతో పోలిస్తే ఎంత రాయితీ లభిస్తుందనే అంశంపై ఆధారపడి ఉంటాయని పురి తెలిపారు. ‘‘చివరకు ప్రతి నిర్ణయం దేశ ప్రయోజనాల ఆధారంగానే తీసుకుంటాం’’ అని ఆయన పేర్కొన్నారు.

మరోవైపు, రష్యా ఇంధన ఎగుమతులపై కొత్త ఆంక్షలు, సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అక్టోబర్‌లో జాతీయ ప్రయోజనాల నిబంధనల కింద మినహాయింపులు ఇచ్చారు. దీంతో భారత్‌పై విధించే అవకాశం ఉన్న భారీ సుంకాల నుంచి కొంత ఉపశమనం లభించింది.

భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య కూడా భారత్‌ ఇంధన సరఫరాలను స్థిరంగా కొనసాగించిందని పురి గతంలో పేర్కొన్నారు. రాబోయే రెండు దశాబ్దాల్లో ప్రపంచ ఇంధన డిమాండ్‌ పెరుగుదలలో దాదాపు నాలుగో వంతు భారత్‌ నుంచే ఉంటుందని ఆయన తెలిపారు.