- ఘటనా స్థలానికి ఆరు ఫైర్ ఇంజిన్లు
- భవనం పైకప్పుపై మరమ్మతు పనులు
- దట్టమైన పొగలు కనిపించడంతో కలకలం
- మంటలను అదుపులోకి తీసుకొచ్చిన సిబ్బంది
దేశ రాజధాని ఢిల్లీలోని కీలక ప్రభుత్వ భవనం నార్త్ బ్లాక్‌లో సోమవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భవనం పైకప్పుపై ఉన్న ఏసీ యూనిట్ వద్ద షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు ప్రాథమిక సమాచారం. దీంతో అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
నార్త్ బ్లాక్ సమీపంలో దట్టమైన పొగలు కనిపించడంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. రాజ్యసభ సభ్యుడు మిలింద్ దేవ్‌రా పార్లమెంటుకు వెళ్తుండగా భవనం వెనుక వైపు నుంచి పొగలు వస్తున్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. దీంతో అగ్నిప్రమాదంపై సమాచారం వేగంగా వ్యాపించింది.
సమాచారం అందుకున్న ఢిల్లీ అగ్నిమాపక శాఖ ఆరు ఫైర్ ఇంజిన్లను ఘటనా స్థలానికి పంపించింది. భవనం పైకప్పుపై మరమ్మతు పనులు జరుగుతున్న సమయంలో విద్యుత్ తీగలకు మంటలు అంటుకున్నట్లు అధికారులు తెలిపినట్లు వార్తా కథనాలు పేర్కొన్నాయి. ఏసీ యూనిట్‌కు సంబంధించిన పరికరాల వద్ద మంటలు చెలరేగినట్లు మరికొన్ని కథనాల ద్వారా తెలుస్తోంది.
నార్త్ బ్లాక్‌లో కేంద్ర హోంశాఖ, ఆర్థిక శాఖ సహా కీలక ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. ఈ భవనం పార్లమెంటుకు సమీపంలో ఉండటంతో ఘటనపై ఆసక్తి నెలకొంది. అయితే మంటలను అదుపులోకి తీసుకున్నట్లు తాజా సమాచారం వెల్లడించింది. ఈ ఘటనలో ఎవరైనా గాయపడ్డారా? ఆస్తి నష్టం ఎంత జరిగింది? అనే వివరాలు వెంటనే అందుబాటులోకి రాలేదు.