మెట్రో న్యూస్,
అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో పూర్తి పారదర్శకత పాటిస్తూ, నిజమైన అర్హులకే ప్రభుత్వ ప్రయోజనం అందేలా క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన చేపట్టాలని సూచించారు. మంగళవారం ఖానాపూర్ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో స్థానిక శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్‌తో కలిసి కలెక్టర్ భవేశ్ మిశ్రా సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, ప్రభుత్వ భూముల పరిరక్షణ, ప్రజా సమస్యల పరిష్కారం తదితర అంశాలపై సమీక్షించారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన వారికే అందేలా అధికారులు బాధ్యతతో వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు. లబ్ధిదారులను ఎంపిక చేసే ముందు క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో పరిశీలన నిర్వహించి, అర్హతలను నిర్ధారించిన తర్వాతే ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందించాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించాలని, నిర్మాణ పనులు వేగంగా జరిగేలా సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని అన్నారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి వివిధ శాఖల మధ్య సమన్వయం ఉండాలని సూచించారు. ప్రభుత్వ భూములు, ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా రెవెన్యూ, మున్సిపల్ అధికారులు పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటికే అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే భూ సంబంధిత సమస్యలను పరిశీలించి, అర్హత మేరకు పరిష్కరించాలని అన్నారు. మున్సిపల్, రెవెన్యూ, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ స్థానిక సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు.
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ, అధికారులు ప్రజల సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ భూములు, ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలపై సమగ్ర విచారణ చేపట్టి, నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అందే ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా చూడాలని, లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పారదర్శకత పాటించాలని అన్నారు. ముఖ్యంగా స్థానిక గిరిజనులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో లబ్ధిదారులకు ఎదురవుతున్న సమస్యలను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పరిష్కరించాలని, అర్హులైన పేదలకు సొంతింటి కలను సాకారం చేసే దిశగా పనిచేయాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఈ సమావేశంలో ఇన్చార్జి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రాథోడ్ రమేష్, ఆర్డీవో దేవీదాస్, డీవైఎస్వో శ్రీకాంత్ రెడ్డి, తహసీల్దార్లు సుజాత, ఖాజా మొయినుద్దీన్, ఎంపీడీవో రాధా రాథోడ్, మున్సిపల్ కమిషనర్ సుందర్ సింగ్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.