Take a fresh look at your lifestyle.

కాళేశ్వరం పునరుద్ధరణ పనులకు ఆర్మీ సేవ‌లు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

0 14

హైదరాబాద్ (మెట్రో న్యూస్‌):

  • ఎస్సెల్బీసీ ట‌న్నెల్‌కూ స‌హ‌కారం
  • తెలంగాణకు ముగ్గురు ఆర్మీ అధికారుల డిప్యూటేషన్
  • నీటిపారుద‌ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం నిర్మాణాన్ని వేగవంతం చేయడంతోపాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులు, పునరుద్ధరణ పనులను మరింత పటిష్ఠంగా చేపట్టేందుకు భారత సైన్యంలోని ఇంజినీరింగ్ విభాగానికి చెందిన అదనపు అధికారుల సేవలను వినియోగించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్ర‌తిపాద‌న‌కు ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేథ్‌తో అంగీకారం తెలిపారు. లెఫ్టినెంట్ కల్నల్ సత్యదేవ్ సింగ్, లెఫ్టినెంట్ కల్నల్ రంజిత్ ఏ. మీనన్, లెఫ్టినెంట్ కల్నల్ హెచ్.వి. భల్లా సేవలను వినియోగించుకునేందుకు డిప్యుటేషన్‌పై తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓకే చెప్పింది.

“ అత్యంత క్లిష్టమైన భౌగోళిక పరిస్థితుల్లో, విపత్తుల సమయంలో, తీవ్రమైన సవాళ్లు ఎదురైన సందర్భాల్లో కూడా సమర్థవంతంగా పనిచేసేలా సైనిక అధికారులకు శిక్షణ ఇస్తారు. సాంకేతిక నైపుణ్యంతోపాటు నాయకత్వం, జవాబుదారీతనం, లక్ష్యసాధన దృక్పథం వారి ప్రత్యేకత” అని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో సుమారు రెండేళ్లుగా డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న కల్నల్ పరీక్షిత్ మెహ్రా సేవలతో కలిగిన అసాధారణ అనుభవం కూడా మరికొందరు ఆర్మీ అధికారుల సేవలను తీసుకోవాలనే నిర్ణయానికి ప్రధాన కారణమని మంత్రి తెలిపారు. డిప్యూటీష‌న్‌పై వ‌చ్చే ముగ్గురు అధికారుల్లో ఒకరిని ఎస్‌ఎల్‌బీసీ సొరంగం రెండు వైపులా జరుగుతున్న తవ్వకం పనుల పర్యవేక్షణకు నియమించనున్నారు. మిగిలిన ఇద్దరు అధికారులను మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులు, పునరుద్ధరణ పనులకు నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది.

Leave A Reply

Your email address will not be published.