కారుణ్య నియామకాలు జరపాలి
మరణించిన మోడల్ స్కూల్ టీచర్ల కుటుంబాలను ఆదుకోవాలి
మాజీ మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్ (మెట్రో న్యూస్):
కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి నిర్లక్ష్య వైఖరి వల్ల మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు, వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. నేడు టీచర్ల సంఘం నాయకులు, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఉపాధ్యాయుల కుటుంబ సభ్యులు తనను కలిసి తమ ఆవేదనను వెళ్లబోసుకున్నారని పేర్కొన్నారు. గడచిన 32 నెలలుగా ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నా పాలకుల్లో కనికరం లేకపోవడం రేవంత్ రెడ్డి అమానవీయ పాలనకు నిదర్శనం అన్నారు. 2004 తర్వాత సీపీఎస్ విధానంలో నియమితులై, ప్రాణాలు కోల్పోయిన సుమారు 40 మంది మోడల్ స్కూల్ టీచర్ల కుటుంబాల పరిస్థితి ఈ ప్రభుత్వంలో అత్యంత దయనీయంగా, అగమ్యగోచరంగా మారిందన్నారు. ఇంటి పెద్దను కోల్పోయి, చిన్నపిల్లలతో ఆ కుటుంబాలు పడుతున్న ఆవేదన వర్ణణాతీతం. ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించి ఆ కుటుంబాలకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించి వారిని ఆదుకోవాలని హరీశ్‌రావు ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.