Take a fresh look at your lifestyle.

‘మన్ కీ బాత్’లో ఉసిరిపై ప్రధాని ప్రశంసలు.. ఆరోగ్యంతో పాటు ఆదాయానికి మార్గం!

0 21
  • ‘మన్ కీ బాత్’లో ఉసిరిని సూపర్‌ఫుడ్‌గా అభివర్ణించిన ప్రధాని మోదీ
  • ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌లో ఉసిరి పరిశ్రమ విజయవంతమైందని వెల్లడి
  • మహిళా స్వయం సహాయక బృందాల ఆదాయం పెరిగిందన్న ప్రధాని
  • పోషకాహార లోపాన్ని తగ్గించడంలో ఉసిరి కీలకమని వ్యాఖ్య
  • ‘ఓకల్ ఫర్ లోకల్’ నినాదానికి ఉసిరి సాగు ఊతమిస్తుందని పిలుపు

ప్రధాని నరేంద్ర మోదీ తన నెలవారీ రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’ తాజా ఎపిసోడ్‌లో భారతీయ సంప్రదాయ ఫలం ఉసిరిపై ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఉసిరికాయను ఒక ‘సూపర్‌ఫుడ్’గా అభివర్ణించిన ఆయన, ఇది రుచికి రుచిని, ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందిస్తుందని కొనియాడారు.

కేవలం ఆరోగ్య ప్రయోజనాలకే పరిమితం కాకుండా, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల జీవనోపాధిని మెరుగుపరచడంలో ఉసిరి కీలక పాత్ర పోషిస్తోందని ఆయన వివరించారు. ఈ స్థానిక ఫలాన్ని ప్రోత్సహించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు పౌష్టికాహార భద్రతను కూడా బలోపేతం చేయవచ్చని ప్రధాని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాను ప్రధాని మోదీ ఉదాహరణగా చూపించారు. ఈ ప్రాంతానికి ఉసిరితో శతాబ్దాల అనుబంధం ఉందని, ప్రస్తుతం ‘ఒక జిల్లా – ఒక ఉత్పత్తి’ (ఓడీఓపీ) పథకం కింద ఇక్కడి ఉసిరి పరిశ్రమకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు.

ప్రతాప్‌గఢ్‌లో దాదాపు 100 ఉసిరి ప్రాసెసింగ్ యూనిట్లు పనిచేస్తున్నాయని, వీటిలో మహిళా స్వయం సహాయక సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రశంసించారు. దేవ్‌గఢ్ కమాసీ గ్రామంలోని సావిత్రి ఫూలే స్వయం సహాయక బృందం ఉసిరితో క్యాండీ, మురబ్బా, జ్యూస్ వంటివి తయారు చేస్తోందని, వింధ్యవాసిని బృందం పచ్చళ్లు, జీర్ణశక్తిని పెంచే పొడులను ఉత్పత్తి చేస్తోందని మోదీ ఉదహరించారు.

ప్రభుత్వ సహకారంతో యంత్రాలు, రుణాలు, మార్కెట్ సౌకర్యాలు అందుబాటులోకి రావడం వల్ల ఈ మహిళల ఆదాయం గణనీయంగా పెరిగిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

ఉసిరిలో ఉండే పోషక విలువల గురించి కూడా ప్రధాని మాట్లాడారు. నారింజ పండుతో పోలిస్తే ఉసిరిలో అనేక రెట్లు ఎక్కువ విటమిన్ సి ఉంటుందని శాస్త్రీయంగా నిరూపితమైందని గుర్తుచేశారు. విటమిన్ సి తో పాటు యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, ఇతర సూక్ష్మ పోషకాలు ఉసిరిలో పుష్కలంగా ఉంటాయన్నారు.

దీనిని రోజూవారీ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు, జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుందని, చర్మం, జుట్టు ఆరోగ్యం కూడా బాగుంటుందని పేర్కొన్నారు. రక్తంలో చక్కెర స్థాయిలు, కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలోనూ ఉసిరి సహాయపడుతుందని ప్రధాని వివరించారు.

మన ఇళ్లలో ఊరగాయలు, మురబ్బా, చ్యవన్‌ప్రాశ్ వంటి రూపాల్లో ఉసిరిని ఎప్పటినుంచో వాడుతున్నామని, ఈ సంప్రదాయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ప్రధాని కోరారు. ఉసిరి వంటి స్థానిక సూపర్‌ఫుడ్‌లను ప్రోత్సహించడం ‘ఓకల్ ఫర్ లోకల్’ నినాదానికి నిజమైన స్ఫూర్తినిస్తుందని అన్నారు.

తక్కువ ధరకే లభించే ఇలాంటి పోషకాహారం ద్వారా దేశంలో పోషకాహార లోపాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని, తద్వారా ఆరోగ్యవంతమైన, స్వావలంబన కలిగిన భారతదేశాన్ని నిర్మించవచ్చని ప్రధాని మోదీ ఆకాంక్షించారు.

Leave A Reply

Your email address will not be published.