- మంత్రి వర్గం నుంచి బర్తరఫ్
- కొండా సురేఖకు డాటర్ స్ట్రోక్
- గవర్నర్‌కు లేఖ పంపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్ (మెట్రో న్యూస్):
మంత్రి కొండా సురేఖను రాష్ట్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు. రాజీనామా చేయడానికి మంత్రి సిద్ధంగా లేకపోవడంతో… వేటు వేయడానికి కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో మంత్రిని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేస్తున్నట్టు గవర్నర్‌కు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ పంపించారు. ప్రభుత్వం నిర్ణయానికి ఆమోదం తెలపాల్సిందిగా కోరారు. సీఎం అభ్యర్థన మేరకు గవర్నర్
ఆమోదించడం లాంచనమే కావడంతో రెండు వారాలుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. సీఎం రేవంత్ రెడ్డి భావించినట్టుగానే ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకునేలోపు సురేఖ వివాదానికి ఫుల్‌స్టాప్ పడింది. కొండా సురేఖ బర్తరఫ్‌తో మంత్రి వర్గం సంఖ్య 15కు పడిపోయింది. కొత్తగా ముగ్గురిని నియమించుకునే అవకాశం ఏర్పడింది. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డిని కూడా ఆ పదవిని తొలగించారు.
హైకమాండ్‌కు వివరణ ఇవ్వడానికి వెళ్లిన సురేఖకు… సంస్థాగత వ్యవహారాల ఇంచార్జ్ కేసీ వేణుగోపాల్ అపాయింట్మెంట్ ఇవ్వలేదంటేనే… ఆమెపై చర్యలకు అధిష్టానం ఫిక్స్ అయ్యిందని స్పష్టమైంది. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను కలిసి మరోసారి వివరణ ఇచ్చే ప్రయత్నం చేసిన మంత్రి… అగ్రనేతలకు రాతపూర్వకంగా, వాట్సాప్ ద్వారా తన వివరణను తెలియజేసేందుకు ప్రయత్నించారు. తన గోడును ఏఐసీసీ పెద్దలెవ్వరూ వినేందుకు సిద్ధంగా లేకపోవడంతో… నిరాశానిస్పృహలతో కూడిన ఆవేశంతో ఆమె సీఎం, డిప్యూటీ సీఎం, ఇతర మంత్రులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సమస్యను పెద్దది చేసుకున్నారు. ఎమ్మెల్యేలకూ నోటీసులివ్వాలన్నారు.
ఢిల్లీలో మీడియాతో కాసేపు చిట్‌చాట్, మరికాసేపు నేరుగా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ పెద్దలపై ఎదురుదాడికి దిగారు. బీసీ కార్డు వాడారు. లక్షలాది మంది జనాభా ఉన్న బీసీ సామాజిక వర్గాలకు తమ ఫ్యామిలీ ప్రాతినిథ్యం వహిస్తుందని హైకమాండ్‌ను పరోక్షంగా హెచ్చరించేందుకు యత్నించారు. ఇవన్నీ ఆమెకు ప్రతికూలంగానే పరిణమించాయి. తనను ఎవ్వరూ రాజీనామా చేయాలని ఆదేశించలేదని, తనపై చర్యలకు ఒకవేళ సీఎం ఒత్తిడి చేస్తే బర్తరఫ్ చేసుకోవచ్చనీ పేర్కొనడంతో… ఏఐసీసీ అగ్రనేతలూ విస్మయం చెందారని తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొదటినుంచీ కొండా ఫ్యామిలీకి ఇంచార్జ్ మంత్రి పొంగులేటితో వివాదాలు ఉన్నాయి. చివరకు మరో మహిళా మంత్రి సీతక్కతోనూ ఆమెకు విభేదాలు ఉన్నాయన్న ప్రచారం జరిగింది. మేడారం మహాజాతర సందర్భంలో దీనిగురించే ప్రధాన చర్చ ఉండింది.