హైదరాబాద్ (మెట్రో న్యూస్):
తెలంగాణా సంస్కృతీ ప్రత్యేకత గాంచిన బతుకమ్మ పూల పండగను ఈనెల 10 నుండి 18వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు వెల్లడించారు. బతుకమ్మ వేడుకల ఏర్పాట్ల పై శనివారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల కార్యదర్శులు, పోలీస్ అధికారులు హాజయ్యారు. ఈ సందర్భంగా సిఎస్ ఈనెల 18వ తేదీన సద్దుల బతుకమ్మను పురస్కరించుకొని ట్యాంక్ బండ్పై వేలాది మంది మహిళలచే సద్దుల బతుకమ్మ ఉత్సవాన్ని అత్యంత వైభంగా నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. బతుకమ్మ ఉత్సవాలను ప్రతిబింబించేలా ఈసారి ప్రత్యేక లోగోను రూపొందిస్తున్నామన్నారు.
18వ తేదీ సాయంత్రం 4 గంటలకు సచివాలయం ఎదురుగాగల అమరవీరుల స్మారక కేంద్రం నుండి వేలాది మంది మహిళలు బతుకమ్మలతో ఊరేగింపుగా వచ్చి ట్యాంక్ బండ్ పైకి చేరుకుంటారని, వీరితోపాటు వందలాది మంది కళాకారులు తమ కళారూపాలతో ర్యాలీగా వస్తారని సీఎస్ వివరించారు. ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసే ప్రత్యేక వేదిక వద్ద జరిగే ఈ బతుకమ్మ ఉత్సవాలకు ప్రజాప్రతినిధులు హాజరవుతారని అన్నారు. ఈ బతుకమ్మ ఉత్సవాలను పురస్కరించుకొని పండగ శోభ వచ్చేలా నగరంలోని ప్రధాన కూడళ్లలో బతుకమ్మలను ఏర్పాటు చేయడమే కాకుండా పలు జంక్షన్ల కేంద్రాల వద్ద విధ్యుత్ దీపాలతో అలంకరించాలని ఆదేశించారు. నగరంలోని అన్ని ప్రధాన కార్యాలయాలను కూడా విద్యుత్ దీపాలతో అలంకరించాలని సంబంధిత శాఖల అధికారులను సీఎస్ జాజు ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని టూరిజం కేంద్రాలు, ప్రముఖ ప్రాంతాల్లోనూ బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించాలని అన్నారు.