ఘట్కేసర్:
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ రైల్వేస్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రైలు ఢీకొని సుమారు వందకు పైగా గొర్రెలు అక్కడికక్కడే మృతిచెందినట్లు తెలుస్తోంది. అషాపూర్ సమీపంలోని కేఫాల్ వద్ద మంగళవారం ఉదయం ఈ దుర్ఘటన జరిగింది. కాజీపేట నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ పట్టాలపై నిద్రిస్తున్న గొర్రెల మందపై నుంచి వెళ్లడంతో ఈ ప్రమాదం సంభవించిందని పోలీసులు తెలిపారు.
ప్రమాద జరిగిన సమయంలో గొర్రెల కాపర్లు రైల్వే ట్రాక్‌కు కొద్దిదూరంలో నిద్రిస్తుండటంతో ఈ ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున రైలు వచ్చే సమయంలో శబ్దానికి గొర్రెలు భయాందోళనకు గురై ట్రాక్‌పైకి పరుగులు తీయడంతో ఎక్కువ గొర్రెలు మృత్యువాత పడ్డాయి. ఈ క్రమంలో వేగంగా వస్తున్న దక్షిణ ఎక్స్‌ప్రెస్ గొర్రెలను ఢీకొట్టడంతో అవి చనిపోయాయి.
సమాచారం అందుకున్న రైల్వే అధికారులు, పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిశీలించారు. ప్రమాద తీవ్రతకు గొర్రెలు శరీరావయవాలు ఛిద్రమై ట్రాక్‌పై పడిపోవడంతో ఆ ప్రాంతమంతా అత్యంత విషాదకరంగా మారింది. జీవనాధారమైన గొర్రెలు మృత్యువాత పడటంతో గొర్రెల కాపర్లు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అధికారులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నారు.