హైదరాబాద్ (మెట్రో న్యూస్):
తెలంగాణ–ఆగా ఖాన్ అభివృద్ధి సంస్థ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-Vతో నిర్వహించిన భేటీలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. ఇస్మాయిలీ ముస్లింల 50వ వారసత్వ ఇమామ్, ఆగా ఖాన్ డెవలప్‌మెంట్ నెట్‌వర్క్ చైర్మన్ హిజ్ హైనెస్ ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-V సోమవారం లోక్‌భవన్లో గవర్నర్ శుక్లాను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఇమామ్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం భారత్, తెలంగాణలో ఆయన చేసిన తొలి అధికారిక పర్యటన సందర్భంగా గవర్నర్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం లోక్ భవన్లో వారిద్దరు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. హైదరాబాద్, తెలంగాణకు ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్ V రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌కు ఆగా ఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్‌తో ఉన్న చిరకాల అనుబంధాన్ని గవర్నర్ ప్రస్తావించారు.
2024 జూలైలో పునరుద్ధరించిన కుతుబ్‌షాహీ సముదాయాన్ని ప్రారంభించేందుకు ప్రిన్స్ హైదరాబాద్‌కు వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. చారిత్రక కట్టడాల పరిరక్షణ, పరిసరాల అభివృద్ధిలో ఆగా ఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ చేపట్టిన కార్యక్రమాలు ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. ఆ సంస్థ చేపట్టిన బహుముఖ అభివృద్ధి కార్యక్రమాలను గవర్నర్ ప్రశంసించారు. విద్య, పట్టణ పునరుద్ధరణ, సామాజిక ఆరోగ్య సేవలు, మహిళా సాధికారత, ఉపాధి కల్పన తదితర రంగాల్లో సంస్థ చేస్తున్న కృషి స్థానిక సమాజాలకు దీర్ఘకాలిక ప్రయోజనాలను అందిస్తోందని పేర్కొన్నారు. తెలంగాణ–ఏకేడీఎన్ మధ్య సహకారాన్ని మరింత విస్తరించాలి అన్నారు. తెలంగాణ కళా వైభవానికి ప్రతీకగా.. గ్రామీణ తెలంగాణ జీవనశైలిని ప్రతిబింబించే చేర్యాల నకాషీ చిత్రాన్ని, హంస ఆకృతితో రూపొందించిన కరీంనగర్ వెండి ఫిలిగ్రీ వీణను ప్రిన్స్ రహీమ్‌కు గవర్నర్ అందజేశారు.