హైదరాబాద్ (మెట్రో న్యూస్):
శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్‌ను దూషించిన కేసులో అరెస్టు అయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీల రిమాండ్‌ను నాంపల్లి కోర్టు తిరస్కరించింది. దీంతో తాతా మధు, నవీన్ రెడ్డిలకు ఊరట లభించింది. వారిద్దరికి రూ. 20 వేల పూచీకత్తుతో రెండు ష్యూరిటీలు సమర్పించాలన్న షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. కేసు విచారణ ఈ నెల 17వ తేదీకి వాయిదా వేస్తూ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డి వ్యక్తిగతంగా హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. ధరావత్తులు సమర్పించిన అనంతరం తాతా మధు, నవీన్ రెడ్డిలను పోలీసులు విడుదల చేశారు.

మరోవైపు… వారిద్దరు నేరుగా కౌన్సిల్‌కి చేరుకొని… ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, సహచర ఎమ్మెల్సీలతో కలిసి మండలి మీడియా పాయింట్ వద్ద మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇది గమనించిన మార్షల్స్ అప్రమత్తమై ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను అక్కడినుంచి బలవంతంగా లాక్కెల్లారు. వారిని పోలీసు వాహనాల్లోకి ఎక్కించి కౌన్సిల్ ప్రాంగణం నుండి తరలించారు. అప్పటికే ఆ ఇద్దరు ఎమ్మెల్సీలను మండలి చైర్మన్ గుత్తా సస్పెండ్ చేయడం గమనార్హం. సెషన్స్ మొత్తానికి బహిష్కరించి నేపథ్యంలో .. మండలి ప్రాంగణంలో వారు కనిపించడంతో మీడియా పాయింట్ వద్ద మాట్లాడరాదని మార్షల్స్ అభ్యంతరం తెలిపారు.